– కొలంబియా పర్యటనలో రాహుల్ వ్యాఖ్యలు
న్యూదిల్లీ, అక్టోబర్ 3: నరేంద్ర మోడీ పాలనలోని భారత్‌లో ప్రజాస్వామ్య దాడులు జరుగుతున్నా యంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది దేశంలో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడేనంటూ మండిపడ్డారు. కొలంబియా పర్యటనలో ఉన్న ఆయన ఈఐఏ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. భారత్‌లో ఎన్నో మతాలు, కులాలు, సంప్రదాయాలు ఉన్నాయి.. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతి ఒక్కరికీ చోటు కల్పిస్తుంది.. కానీ ప్రస్తుతం ఈ వ్యవస్థ ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది అని అన్నారు. కాగా, ఇంధన వినియోగంలో వచ్చిన మార్పులతో అనేక సామ్రాజ్యాల సృష్టి జరుగుతూ వస్తోందని, బ్రిటిష్‌వారు ఆవిరి యంత్రం, బొగ్గుపై నియంత్రణ సాధించి ఆ తర్వాత సూపర్ పవర్‌గా మారారని తెలిపారు. ఆ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి 1947లో తాము స్వాతంత్య్రాన్ని సాధించుకున్నామన్నారు. పెట్రోల్ వినియోగం పెరిగిన క్రమంలో అమెరికన్ల పట్టు పెరిగింది.. ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ వైపు మళ్లుతోందని, ఇప్పుడు పోటీ అమెరికా, చైనా మధ్య నెలకొని ఉందని అన్నారు. ఇండియాలో వికేంద్రీకృత, వైవిధ్య వ్యవస్థ ఉందని, అది సంక్లిష్టంగా ఉంటుందని, చైనాతో పోల్చుకుంటే భారత్‌కున్న సామర్థ్యాలు భిన్నమైనవని, తమ దేశం అధ్యాత్మిక, సైద్దాంతిక సంప్రదాయాలను కలిగి ఉందని, అవి ఈనాటికీ ఆచరణీయమైనవని తెలిపారు. చైనాలాగా భారత్ తన ప్రజలను అణచివేయదని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత్‌లో ఆర్థిక వృద్ధి ఉందని, అయితే తమది సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థ అని, కానీ ఉత్పత్తి భారీ స్థాయిలో లేకపోవడంతో ఉద్యోగాల కల్పన ఆశించినస్థాయిలో లేదని వ్యాఖ్యానించారు. మాకు ప్రజాస్వామ్య వ్యవస్థే ఉండాలంటూ అలాంటి వ్యవస్థను అభివృద్ధి చేయడమే సవాలని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


