భద్రాచలం ఆలయ ఈవోపై దాడి హేయం

– రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచి డిప్యూటీ కలెక్టర్ల సంఘం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై జరిగిన దాడి పట్ల రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచి డిప్యూటీ కలెక్టర్ల సంఘం అందోళన వ్యక్తం చేసింది. అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.చంద్రమోహన్‌, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రావులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌తో ఫోన్‌లో మాట్లాడి సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. దాడికి గురై ఐసీయులో చికిత్స పొందుతుండగా రమాదేవి యోగక్షేమాల గురించి ఈవో వ్యక్తిగత సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి వాకబు చేశారు. ఈవో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాముని భూములకు రక్షణగా నిలిచిన ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నంకు చెందిన భూ ఆక్రమణ దారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ, ఆలయ భూములకు రక్షణగా విధులు నిర్వర్తించే అధికారులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని కోరారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తేవాలన్నారు. కోర్టు తీర్పు మేరకు భద్రాచలం రాముని భూములకు ఆలయ ఈవో రక్షణగా ఉన్నారని, చట్టాన్ని ఉల్లంఘించి ఆక్రమణలు చేస్తున్న వారిని అడ్డుకున్న ఆమెపై దాడి చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పురుషోత్తపట్నం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకొనేలా చూడాలన్నారు. అధికారులకు మనో ధైర్యం కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *