- ఏడు రాష్ట్రాల్లో 40కి పైగా చోరీలు.. వరంగల్ పోలీసుల చేతికి ఏడుగురు నిందితులు
- రూ. 5.10 లక్షల నగదు, రెండు కార్లు, నకిలీ తాళాలు స్వాధీనం
- ఏటీఎం మిషన్‌లో లోపాన్ని ఆసరాగా చేసుకుని భారీ దోపిడీ
- టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్న సీసీఎస్, కాజీపేట పోలీసులు
Telangana crime news | ఏటీఎం కేంద్రాలకు కన్నం వేసి చోరీలకు (ATM theft) పాల్పడుతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఏడుగురు నిందితుల ముఠాను సీసీఎస్, కాజీపేట పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి పోలీసులు రూ.5 .10 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, నేరానికి వినియోగించే ఐరన్ ప్లేట్లను, డూప్లికేట్ తాళం చెవులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా మాల్కిడా తాలుకాకు చెందిన ఆరిఫ్ ఖాన్ (23), సర్ఫరాజ్ (24), యం.ఆష్ మహ్మద్ (29), షాపుస్ ఖాన్ (33), షారూఖాన్ (33), అస్లాం ఖాన్ (33), యం.షారుఖాస్ (27)ఉన్నారు. వీరంతా స్నేహితులు. అందరూ 23 నుంచి 33 ఏళ్ల లోపు వారే.. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దారి ఎంచుకున్నారు.
ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ వివరించారు. ఏడుగురు ముఠా సభ్యులందరూ నిత్యం మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారు. వీరి సంపాదన జల్సాలకు సరిపోక చోరీలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఈ ముఠా సభ్యులు పెట్రో కంపెనీకి చెందిన పాత ఏటీఎం మిషన్లలో ఉన్న సాంకేతిక లోపాన్ని గుర్తించారు. ఈ మిషన్లను తెరిచేందుకు వీలుగా డూప్లికేట్ తాళాలను తయారు చేసుకున్నారు. ఏటీఎం లోపలికి వెళ్లి నకిలీ తాళంతో మిషన్ ముందు భాగాన్ని తెరిచి, నగదు బయటకు వచ్చే స్లాట్ వద్ద ఒక ఇనుప రేకును గమ్ సహాయంతో అతికించేవారు. ఎవరైనా డబ్బు డ్రా చేసినప్పుడు, ఆ ఇనుప రేకు కారణంగా నగదు బయటకు రాకుండా లోపలే ఆగిపోయేది. ట్రాన్సాక్షన్ పూర్తయినట్లు మెసేజ్ వొచ్చినా డబ్బు చేతికి అందకపోవడంతో ఖాతాదారులు మిషన్ లోపం అనుకుని వెనుదిరిగేవారు. ఖాతాదారుడు వెళ్లగానే ముఠా సభ్యులు లోపలికి వెళ్లి నకిలీ తాళంతో మిషన్ తీసి అక్కడ నిలిచిపోయిన నగదును కాజేసేవారు.
ఇదే తరహాలో నిందితులు రాజస్థాన్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఈ చోరీలపై బ్యాంక్ అధికారులకు పలు ఫిర్యాదులు రావడంతో బ్యాంక్ అధికారులు పెట్రో కంపెనీకి చెందిన పాత ఏటీఎం మిషన్ స్థానంలో కొత్త ఏటీయంలను ఏర్పాటు చేయడంతో ఈ ముఠా చోరీలకు చాన్స్ లేకుండా పోయింది. దీంతో వీరు ఈ తరహా ఏటీయం మిషన్లు ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 40 కి పైగా చోరీలకు పాల్పడ్డారు.
ఈ క్రమంలో వరంగల్‌కు రెండు కార్లలో చేరుకున్న ఈ ముఠా ముందుగా నగరంలో పెట్రో ఏటీయం మిషన్లు ఉన్న ఏటీఎం కేంద్రాలు గుర్తించి గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు 7 ఏటీఎంలలో చోరీలకు పాల్పడి మొత్తం రూ.12.10 లక్షల కాజేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో 4, కాజీపేట, హన్మకొండ, మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీకి పాల్పడ్డారు. బ్యాంకు వారు థర్డ్ పార్టీ అయిన ఎటిఎం సెక్యూరిటీ, మెయింటెనెన్స్ చేసే సంస్ధ అయిన FSS LTD ( ఫైనాన్సియల్ సాఫ్ట్ వెర్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ) వారికి సమాచారం ఇవ్వగా వారు పోలీసులను సంప్రదించారు. క్రైమ్స్ అదనపు డీసీపీ బాల స్వామి, క్రైమ్, కాజిపేట్ ఏసిపిలు సదయ్య, ప్రశాంత్ రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. పోలీసులు నిందితులను గుర్తించి వారిపై నిఘా పెట్టారు.
నిందితులు ఆదివారం ఉదయం కాజీపేట చౌరస్తాలోని పెట్రో కంపెనీకి చెందిన ఏటీఎం కేంద్రాల్లో తిరిగి చోరీ చేసేందుకు కార్లలో వచ్చి ఎవరూ లేని సమయంలో ATM డోర్ ఓపెన్ చేసి దానికి స్టికర్ అతికించిన ఐరన్ ప్లేట్ ని బిగిస్తుండగా పోలీస్ అక్కడికి చేరుకున్నారు. ఇది గ్రహించి వారు పారిపోతుండగా పోలీసు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా చేసిన చోరీలను అంగీకరించారు.
ఈ ముఠా సభ్యులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట్ ఇన్‌స్పెక్టర్‌సుధాకర్ రెడ్డి, ఏఏఓ సల్మాన్ పాషా, కాజీపేట ఎస్.ఐలు నవీన్‌కుమార్,లవణ్ కుమార్, సిసిఎస్ ఎస్.ఐ శ్రీనివాస్ రాజు, హెడ్ కానిస్టేబుళ్ళు మషేశ్వర్, శ్రీనివాస్ కానిస్టేబుళ్ళు విష్ణు, కుమారస్వామి, శ్రీధర్, హన్మంతు, వినోద్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేశారు.




