– ఈనెల 28నుంచి ప్రారంభం
– 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా
– విధి నిర్వహణలో 50 వేల మంది అధికారులు, సిబ్బంది
– భక్తులకు ఏ లోటు రాకుండా విస్తృత ఏర్పాట్లు
మేడారం, ప్రజాతంత్ర, జనవరి 21: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో జాతరను ఏవిధమైన ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈనెల 28 నుండి 31వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. మేడారం చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రూ.251 కోట్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేటాయించారు. మరో వందేళ్ల వరకు నిలిచిపోయేలా సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ అభివృద్ధికే రూ.100 కోట్లను కేటాయించి రికార్డు సమయంలో పనులను పూర్తి చేశారు. ఈనెల 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం ఈ అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతమంతా విద్యుత్ వెలుగులీనుతోంది. ఏర్పాట్లన్నీ పూర్తయినాయి.
జాతర నిర్వహణకు 50వేల మంది అధికారులు, సిబ్బంది
ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరకు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ జాతరకు భక్తులు మూడు దశలలో వస్తారు. జాతర ప్రారంభానికి ముందుగానే దాదాపు 30 నుండి 35 శాతం మంది అమ్మవార్లను దర్శించుకుంటారు. జాతర సమయంలో 60 నుండి 65 శాతం, జాతర అనంతరం 3.5 శాతం మంది భక్తులు దర్శించుకుంటారు. ఇందుకుగాను మేడారం జాతర ప్రదేశాన్ని మొత్తం ఎనిమిది ప్రధాన పరిపాలనా జోన్ లుగా విభజించారు. ఈ జోన్ ఒక్కొక్క దానికి ఒక జిల్లాస్థాయి అధికారిని జోనల్ అధికారిగా, సీనియర్ అసిస్టెంట్ అధికారిని అసిస్టెంట్ జోనల్ అధికారిగా నియమించారు. 42 సెక్టార్లుగా ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్‌కు మండల స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. వీటిలో ముఖ్యంగా, టెంపుల్ -చిలకలగట్టు ప్రాంతాన్ని జోన్-1గా పెట్టి దీనిలో మాస్టర్ కంట్రోల్ రూమ్, మేడారం ప్రొటోకాల్ ఆఫీస్, టెంపుల్ ఎంట్రీ పాయింట్స్, టెంపుల్ ఎగ్జిట్ పాయింట్లు, గద్దెల వద్ద తప్పిపోయిన వారి క్యాంపు, మీడియా సెంటర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్- రెడ్డిగూడెంను రెండవ జోన్‌గా ఏర్పాటు చేసి బస్సుల అలైటింగ్ పాయింట్స్, మెస్, అధికారులు, ఉద్యోగుల బసను ఏర్పాటుచేశారు. స్తూపం, కోటూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 3, 4 జోన్లలోనూ తప్పిపోయిన వారి కేంద్రాలు, ఓవర్ అల్ మానిటరింగ్ టీమ్స్, షటిల్ బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఊరట్టం, శివరాంనగర్, పడిగాపూర్, నార్లాపూర్‌లను మిగతా జోన్‌లుగా విభజించి తగు ఏర్పాట్లు చేశారు.
21 శాఖలచే సివిల్, నాన్-సివిల్ పనుల నిర్వహణ
ఈ జాతరకు సంబంధించి సివిల్, నాన్ సివిల్ పనులను 21 ప్రభుత్వ శాఖలు చేపట్టాయి. ఎన్.ఎస్.ఎస్, ఆదివాసీ యువకులు మొత్తం 2000 వేల మంది ప్రత్యక్షంగా ఈ జాతర నిర్వహణలో స్వచ్ఛందంగా భాగస్వామ్య మవుతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 50 వేల మంది అధికారులు, సిబ్బంది ఈ మేడారం జాతరను సక్రమంగా నిర్వహించడానికి నియమితులయ్యారు. వీరిలో ప్రధానంగా ఆరు వేలమందిని జాతరకు ముందుగా, 32 వేల మందిని నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా, ఆరు వేలపైగా సిబ్బందిని జాతర అనంతరం ఏడు రోజులపాటు పనులు నిర్వహించేందుకు కేటాయించారు.
మెరుగైన నెట్‌వర్క్, కమ్యూనికేషన్‌కు 27 శాశ్వత సెల్ టవర్స్
జాతర సమయంలో మెరుగైన మొబైల్ సెల్ సేవలందించేందుకు బీఎసఎనఎల్, ఎయిర్‌టెల్, జియో తదితర మొబైల్ ప్రొవైడర్లు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. ఇప్పటికే, 27 మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశాయి. మరో 33 వీల్స్ టవర్లు, 450 వీహెచఎఫ్ సెట్స్‌ను ఏర్పాటు చేశాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





