(మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేకప్రతినిధి )
భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ రాజకీయ భవిష్యత్‌పైన విపక్ష పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీలు బిఆర్‌ఎస్ బంతిని ఎవరికివారే ఎదుటి కోర్టులోకి నెట్టివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. బిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని బిజెపి, కాదు బిజెపిలోనే విలీనం అవుతుందని కాంగ్రెస్ వాదిస్తూ వొస్తున్నాయి. ప్రధానంగా బిఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఈ ప్రచారం మరింత విస్తృతంగా మారింది. బిఆర్‌ఎస్ పాలనాకాలంలో చేసిన తప్పులపై కేంద్రం స్పందించడంలేదని రాష్ట్ర ప్రభుత్వం, బిఆర్‌ఎస్ తప్పిదాలపై నిత్యం ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ఆమేరకు చర్యలు తీసుకోవడంలేదంటూ బిజెపి ఒకదానిపైన ఒకటి విమర్షనాస్త్రాలను సంధించుకుంటున్నాయి. బిఆర్‌ఎస్‌తో సాన్నిత్యం ఉండడంవల్లే ప్రత్యక్ష చర్యలు తీసుకోవడంలేదంటూ ఈ రెండుపార్టీలు గత పద్దెనిమిది నెలలుగా ఆరోపించుకుంటూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే గత బుధవారం బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనాత్మకంగా మారాయి. ఆరోపణ పాతదే అయినా అందుకు సంబంధించిన తేదీలు, ఉదాహరణలు చెప్పడం ప్రజల్లో ఆసక్తి కలిగించింది. తాజాగా ఆయన మీడియా ముందు మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం ఖాయమని పేర్కొన్నారు. అంతేకాదు.
“కాంగ్రెస్, బిజెపి పార్టీలు రాష్ట్రంలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కుంటున్నాయి. కనీసం తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక విషయంలో ఆ పార్టీలు ఎంతోకాలంగా మల్లగుల్లాలు పట్టిందనడానికి తెలంగాణ ప్రజలే ప్రత్యక్ష సాక్షం. చాలాకాలం తర్వాత పార్టీ ఆధ్యక్షుడిని ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్, ఇప్పటికీ పద్దెనిమిది నెలలుండి మంత్రివర్గాన్ని విస్తరించుకోలకపోతున్నది. బిజెపి అయితే ఎన్నికల ముందు నుంచి ఇప్పటివరకు అధ్యక్షుడి విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నది. ఈ రెండు పార్టీలు కూడా ప్రతీ చిన్న విషయానికి దిల్లీపైనే ఆధారపడుతున్నాయి..”
విలీనం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అవుతారని కూడా ఆయన జ్యోస్యం చెప్పడం రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా ఆయన తేదీలను కూడా ఖరారు చేశారు. జూన్ 2వ తేదీ లేదా డిసెంబర్ 9వ తేదీ తర్వాత బిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం జరుగుతుందంటున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ మరో ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా ధృవీకరించడాన్ని చూస్తుంటే బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఏదో జరుగుతున్నదన్న అనుమానానికి తావేర్పడుతున్నది. ప్రభాకర్ ప్రకటించిన మరుసటిరోజే అంటే గురువారం ఆయన కూడా మీడియా సమావేశంలోనే ఈ విషయాన్ని లేవనెత్తడాన్నిబట్టి ఏదో బలమైన సమాచారం బిజెపికి వొచ్చి ఉంటుందనుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ళు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ఇప్పుడు మనుగడ సాగించలేని పరిస్థితిలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కెసిఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోనియాగాంధీని కలుసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్‌లో కలుపుతామని గతంలో కెసిఆర్ ప్రకటించిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే చాలా కాలంగా గుర్తుచేస్తున్న విషయం తెలియందికాదు. కాని, ఆ విషయంలో యూ టర్న్ తీసుకుందంటూ రాజకీయ వర్గాలనుండి బిఆర్‌ఎస్ అనేక విమర్శలను నేటికీ ఎదుర్కుంటూనే ఉంది. ఇదిలా ఉంటే అధికారం కోల్పోయిన తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు.
ఆ పార్టీనుండి కొందరు ఎమ్మెల్యేలు పార్టీమారడం. ఆ కేసు ఉన్నత న్యాయస్థానం పరిధిలో ఉండడం, పార్టీ నాయకత్వం విషయంలో అంతర్గతంగా విభేదాలున్నట్లు వార్తలు వొస్తుండంతో ఆ పార్టీ విలీనం వైపు మొగ్గుచూపుతున్నదన్నది ప్రస్తుతం చర్చగా మారింది. పార్టీని మొదటి నుండి పట్టుకుని ఉన్న మాజీమంత్రి హరీష్‌రావు పరిస్థితి పైన కూడా తీవ్ర చర్చ జరుగుతున్నది. తాను మొదటి నుండి కెసిఆర్‌కు బద్దుడిగా ఉంటున్నానని, ఆయన ఏది ఆదేశిస్తే దాన్ని శిరసావహిస్తానంటూ, ఒకవేళ కెటిఆర్ పార్టీ పగ్గాలు చేపట్టినా ఆయనకు సహకరిస్తానని పేర్కొన్నతీరును రాజకీయ నేతలు విపరీతర్ధాలు తీస్తుండడం కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కాగా, తాము త్వరలోనే అధికారంలోకి వొస్తామని బిఆర్‌ఎస్ చేస్తున్న ప్రకటనలను కూడా విశ్లేషిస్తున్నారు. సంపూర్ణ మెజార్టీతో ఉన్న కాంగ్రెస్‌ను కాదని, బిఆర్‌ఎస్ అధికారంలోకి వొచ్చే అవకాశమేలేదు. అయినా అధికారంలోకి వొస్తామనడం వెనుక షరతులతో కూడిన విలీన అంశమేదైనా ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బిఆర్‌ఎస్ విరుచుకుపడుతున్నది. తమపార్టీ పరిస్థితులనే చక్కదిద్దుకోలేని పార్టీలు తమవైపు వేలెత్తి చూపుతున్నాయని బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్, బిజెపి పార్టీలు రాష్ట్రంలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కుంటున్నాయి. కనీసం తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక విషయంలో ఆ పార్టీలు ఎంతోకాలంగా మల్లగుల్లాలు పట్టిందనడానికి తెలంగాణ ప్రజలే ప్రత్యక్ష సాక్షం. చాలాకాలం తర్వాత పార్టీ ఆధ్యక్షుడిని ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్, ఇప్పటికీ పద్దెనిమిది నెలలుండి మంత్రివర్గాన్ని విస్తరించుకోలకపోతున్నది. బిజెపి అయితే ఎన్నికల ముందు నుంచి ఇప్పటివరకు అధ్యక్షుడి విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నది. ఈ రెండు పార్టీలు కూడా ప్రతీ చిన్న విషయానికి దిల్లీపైనే ఆధారపడుతున్నాయి. పార్టీ పరమైన నిర్ణయాలు స్వయంగా తీసుకోలేకపోతున్న ఈపార్టీలకు తమ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని బిఆర్‌ఎస్ వర్గాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. అయినప్పటికి బిఆర్‌ఎస్‌లో ఏదో ముసలం బయలుదేరిందన్న వార్తలు మాత్రం బాగా వినవొస్తున్నాయి. దానికి తగినట్లుగా ఇటీవల కాలంలో ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత కార్యక్రమాలను రూపొందించుకుంటూ ప్రజల మధ్య తిరుగుతుండడం, హరీష్‌రావు, కెటిఆర్‌ల మద్య మౌన పోరాటం జరుగుతున్నదంటూ వొస్తున్న వార్తల నేపథ్యం బిజెపి ఆరోపణలకు బలాన్నిచ్చేవిగా ఉన్నాయి.





