సహాయక కార్యక్రమాలు చేపట్టాలి

– బీజేపీ శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపు
– ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నందున రాష్ట్ర ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, డ్రెయిన్లు దగ్గరగా వెళ్లరాదు.. పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరుతున్నానన్నారు. వాతావరణ కేంద్రం హెచ్చరించిన ప్రకారం ఈ రోజు హన్మకొండ, జనగాం, మహబూబాబాద్‌, వరంగల్‌, భువనగిరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, కొత్తగూడెం, హైదరాబాద్‌, భూపాలపల్లి, కరీంనగర్‌, మల్కాజ్‌గిరి, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, ఆదిలాబాద్‌, జగిత్యాల, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయన్నారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు మునిగిపోవడం, ట్రాఫిక్‌ అంతరాయం, మురుగు నీరు పొంగి ప్రవహించడం, విద్యుత్‌ అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ అత్యవసర పరిస్థితులు గమనించిన వెంటనే ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ లేదా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సహాయక చర్యలలో పాల్గొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహారం-తాగునీరు పంపిణీ, వైద్య సహాయం, వృద్ధులు, చిన్న పిల్లలకు సహకరించడం వంటి కార్యక్రమాల్లో కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో జాతీయ విపత్తు సహాయ బలగాలతో సమన్వయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడం కర్తవ్యమన్నారు. అందరూ ఒకరొకరు అండగా నిలవాలని రామచందర్‌ రావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *