– స్వతంత్ర ఎమ్మెల్యేగా హాజరవుతున్నా: ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్29: బిజెపికి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తనకు ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కువ ఉందన్నారు. ఒకప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాలన్నా పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉండేదని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయం వరకు సభలో మాట్లాడే అవకాశాన్ని పార్టీ ఇచ్చేది కాదని పేర్కొన్నారు. కానీ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇస్తే వివిధ అంశాలు లేవనెత్తుతానన్నారు. తనలాగే బీజేపీలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. దీనికి తాజా ఉదాహరణ చేవెళ్ల ఎంపీ వ్యవహారమేనని తెలిపారు. వారిలాగే చాలా మంది పదవులు పోతాయని పార్టీలో జరుగుతున్న ఇబ్బందులపై నోరు విప్పడం లేదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా.. వాటిని కొంతమంది సర్వనాశనం చేశారంటూ బీజేపీలోని పలువురు నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకూ దిల్లీలోని బీజేపీ నేతల నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ఒకవేళ వస్తే ఇక్కడ నెలకున్న ఇబ్బందులను వారికి వివరించిన తర్వాతే మళ్లీ ఆ పార్టీలోకి వెళ్తానని స్పష్టం చేశారు. లేకుంటే చచ్చినా.. మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లనని ఆయన కరాకండిగా చెప్పారు. ఇక పార్టీలోని పలువురు ఎంపీలు తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క ఎమ్మెల్యేను సైతం గెలిపించలేకపోయారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, బీసీ బిల్లులపై అసెంబ్లీ సమావేశాలు అనేది కేవలం ప్రజల నుంచి దృష్టి మరల్చడానికి మాత్రమేనని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తీసేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని దమ్ముంటే సీబీఐకి అప్పచాలంటూ రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





