రాష్ట్ర అసెంబ్లీలో దూషణల పర్వం పరాకాష్ట దశను కూడా దాటి పోవడంతో తామెన్నుకున్న నాయకుల వ్యవహారశైలిని తెలంగాణ సమాజం యేవగించుకుంటోంది! బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో సభలో చర్చలు సజావుగా విషయావగాహనతో జరిగాయని భావిస్తున్నా, ఆదివారం శాసనసభలో జరిగిన సంఘటనలు, సభ్యుల మధ్య జరిగిన సంభాషణల తీరు సభ్య సమాజం తలదించుకునేదిగా ఉందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. మైనింగ్‌పై జరిగిన చర్చ సందర్భంగా కడియం శ్రీహరి ప్రసంగిస్తున్నప్పుడు బీఆరఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆయనపై “తుపాకీతో కాలుస్తా” అని అర్థం వొచ్చేలా సైగలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించడంతో గొడవ మొదలైంది.
దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించడం,స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే కౌశిక్‌రెడ్డి మాత్రం తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మాత్రమేసైగ చేశానని అంటున్నారు! అంతకుముందు చర్చలో మైనింగ్ అక్రమాలపై హౌజ్ కమిటీ వేయాలని బీఆరఎస్ నాయకులు పట్టుపట్టడంతో మొత్తం 24మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను రెండురోజులపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. మైనింగ్ విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సన్నిహితులకు కి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అక్రమాలను ముఖ్యమంత్రి వెనకేసుకు వొస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌రావులు ఆరోపించడం, దీనికి ప్రతివ్యూహంగా ముఖ్యమంత్రి 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన మైనింగ్ అక్రమాలపై విచారణకు సీబీ సీఐడీని ఆదేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ అదేశించడం జరిగిపోయాయి.
మైనింగ్ వ్యవహారాలపై జరిగే చర్చను కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్ పూర్తిగా దారి తప్పేలా చేసిందనేది అక్షర సత్యం. సాధారణంగా ఏ సభలోనైనా విపక్షం వారు దూకుడుగానే వ్యవహరించాలని యత్నించడం సహజం. అధికార పార్టీ సంయమనంతో వ్యవహరించి పెద్దమనిషి తరహాగా సమాధాన మివ్వడమనేది మొదట్నుంచీ వొస్తున్న ఆనవాయితీ. కానీ కొన్ని దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకులైనా సంయమనాన్ని కోల్పోతూ రావడాన్ని గమనిస్తున్నాం. ఏదైనా ఒక అంశంపై సభలో అవేశకావేశాలు వెల్లువెత్తడం సహజమే అయినా, దారుణ భాషా ప్రయోగాన్ని యదేచ్ఛగా ప్రయోగించడం ఏకరమైన సభా మర్యాదో సభ్యులకే తెలియాలి. ఆదివారం సభా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్ వారిపై దాడులకు పాల్పడుతున్నారన్పప్పుడు, అధికార కాంగ్రెస్ సభ్యులు అంతగా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు.
అధికార పార్టీ ఎమ్మెల్యే మందుల శ్యామ్యూల్ చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం సమంజసం కాదు. స్పీకర్ ఈ మాటలను రికార్డుల నుంచి తొలగించినా, అంత దారుణ భాషను వాడిన ఆయనను ఎందుకు సస్పెండ్ చేయలేదని విపక్షాలు ప్రశ్నించడం సహజమే. ఎందుకంటే మైనింగ్ విషయంలో 24 మంది విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినప్పుడు “సమన్యాయం” పాటించాలన్నది వారి వాదన. ఇదిలాఉండగా గత జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి స్థానంలో వున్న రేవంత్ రెడ్డి ఏకంగా “విమర్శలు చేస్తే నాలుకలు కోస్తాం” అనడం అప్పట్లో దుమారం రేపింది. ఈ ఏడాది ప్రారంభంలో రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్‌రావులపై వాడిన అసభ్య పదజాలం కూడా విమర్శలకు దారితీసింది. ఒకదశలో ముఖ్యమంత్రి వీధి రౌడీలను తలపించే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నేతలు అప్పట్లో అసెంబ్లీనుంచి వాకౌట్ చేయడం కూడా జరిగింది.
అత్యంత గౌరవప్రదమైన భాష వాడాల్సిన సభలో వ్యక్తిగత దూషణల పర్వం, సభా గౌరవాన్ని మంట గలుపుతోందని విజ్ఞుల ఆవేదన. ఈ తిట్లూ శాపనార్థాలు ప్రజల్లో అసహనాన్ని రేపుతున్నాయన్న సత్యాన్ని కూడా సభ్యులు గుర్తించాలి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గతంలో, కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు చీరెలు, గాజులు పంపిస్తానని వ్యాఖ్యానించడం అప్పట్లో పెద్ద గందరగోళానికి, పోలీసు కేసులకు దారితీసింది. ఇప్పుడు ఈ సస్పెన్షన్లను ఎంతవరకు రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకోవాలో వ్యూహరచనలో బీఆర్‌ఎస్ నేతలు తలమునకలుగా ఉన్నారు. ఒకేసారి 24 మంది సభ్యులను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని భావిస్తున్న బీఆర్‌ఎస్ దీనిపై హైకోర్టును ఆశ్రయించే ఉద్దేశంలో ఉంది . అంతేకాదు ఎథిక్స్ కమిటీకి సరైన వివరణ ఇవ్వడంతో పాటు, కౌశిక్‌రెడ్డిపై ఏకపక్షంగా చర్యలు తీసుకుంటే న్యాయపోరాటం చేస్తామని కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం.
అంతేకాదు దీన్నొక రాజకీయ కక్షపూరిత చర్యగా ప్రజల్లో ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేయాలని కూడా బీఆర్‌ఎస్ నేతల వ్యూహం. ఇదే సమయంలో గతంలో కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో అభ్యంతరకరంగా మాట్లాడిన వీడియోలను కూడా బయటపెట్టాలని బీఆర్‌ఎస్ నేతలు నిర్ణయించారు. అంతేకాదు రాఘవ కన్‌స్ట్రక్షన్స్, ఇతర మైనింగ్ అక్రమాలపై ఆధారాలు బయటపెడతామని హరీష్‌రావు అంటున్నారు.
రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజమే అయినప్పటికీ, ఈ ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదికపై వ్యక్తిగత దూషణలు సభాసాంప్రదాయం కాదు. సభానాయకుడి గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహనం కోల్పోయి “మావద్ద కూడా కండలు తిరిగిన వాళ్లున్నరు. తిరగేసి కొడతారు” వంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారు ..? తెలంగాణ శాసనసభ క్రమంగా వ్యక్తిగత దూషణలకు కేంద్రంగా మారడం దురదృష్టకరం. ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే విశ్లేషణ అనవసరం. తప్పొప్పులు అందరికీ ఉంటాయి కనుక ఒకరినే వేలెత్తి చూపలేం. సభ్యతగా మాట్లాడటం, వ్యవహరించడం అనేది ఎమ్మెల్యేలు తమ ప్రాథమిక కర్తవ్యంగా భావించినప్పుడు ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావు.





