– చర్చల అనంతరం కెసిఆర్ అరెస్టు తప్పదా?
( మండువ రవీందర్‌రావు )
కెసిఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారా..లేదా అన్న అంశం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చజరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశంలో మొదటిరోజు మాత్రమే ప్రతిపక్ష నాయకుడి హోదాలో హాజరైన కెసిఆర్ మళ్ళీ అసెంబ్లీ ముఖం చూడలేదు. అసెంబ్లీ ముఖమేమోగాని తన ముఖమే చూడడం కెసిఆర్‌కు ఇష్టంలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేకసార్లు రెచ్చగొట్టినా కెసిఆర్ మాత్రం గత ఇరవై నెలల్లో ఏనాడు అసెంబ్లీ మెట్లు ఎక్కలేదు. పెద్దలు, అనుభవజ్ఞులు మీ సలహాలు, సూచనలు మాకు కావాలంటూ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పలు సభలు, సమావేశాల సందర్భంగా విజ్ఞప్తి చేశారు. చివరకు ఫామ్‌హౌజ్‌లో కెసిఆర్ గడిపే తీరుపైన వెక్కిరింపు దోరణిలో చేసిన వ్యాఖ్యలు కూడా కెసిఆర్‌లో ఏమాత్రం స్పందనను కలిగించలేకపోయాయి. అయితే కెసిఆర్ అసెంబ్లీకి హాజరవుతే ఆవమానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని బిఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. తమపై చేసే ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా అడుగడుగున అడ్డుపడడం లేదా మైకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలన్న ధోరణి లో కాంగ్రెస్ నాయకులున్నారన్న తమ అనుమానాన్ని బిఆర్‌ఎస్ వ్యక్తం చేస్తున్నది. కాని, కెసిఆర్ అసెంబ్లీకి హాజరు కావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది . భారత రాష్ట్ర సమితి గత పదేళ్ళ పాలనకు సంబంధించి అనేక అవినీతి ఆరోపణలపై శాసనసభ వేదికగా సమాధానం చెప్పుకోక తప్పని పరిస్థితిని సర్వోన్నత న్యాయస్థానం కల్పించింది. పదేళ్ళ కెసిఆర్ పాలనలో ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసింగ్‌లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలు ప్రధానమైనవి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కాళేశ్వరం ప్రధానాంశంగా నిలిచింది. ఎన్నికలకు ముందునుండే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తూ వొచ్చింది. సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజులముందే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌కు సంబందించి రెండు పియర్స్ కుంగిపోవడం కాంగ్రెస్ ఆరోపణకు సాక్షాధారమైంది. అదే బిఆర్‌ఎస్ ప్రభుత్వ పతనానికి కారణంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తాము మొదటినుండి ఆరోపిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపైన జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. పదహారు నెలలపాటు ప్రాజెక్టుకు సంబంధించిన అనేక మందిని విచారించిన ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసినప్పటినుండి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. కమిషన్ రిపోర్టు తప్పుల తడక అంటున్న బిఆర్‌ఎస్ కమిషన్ నివేదిక పై హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించిన నాటి ముఖ్యమంత్రి కెసిఆర్, నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుల పిటిషన్‌లపై స్టే విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఫలితంగా ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే బాధ్యులపై చర్యలుంటాయని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపిన ప్రభుత్వం, ఆమేరకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు చర్చించే విధంగా ఈ నెల 30 శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అయిదు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో కాళేశ్వరంపై పీసీ ఘోష్ సమర్పించిన నివేదిక మాత్రమే చర్చనీయాంశంగా ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. ఘోష్ నివేదికపై సుదీర్ఘంగా జరిగే ఈ చర్చల్లో ముఖ్యంగా కెసిఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాల్సిఉంది. ఎందుకంటే ఘోష్ విచారణ సందర్భంగా అందరి వేళ్ళూ కెసిఆర్ వైపే చూపించడంతో కెసిఆర్ తప్పనిసరిగా వివరణ ఇచ్చుకోవాల్సిఉంది. అయితే కెసిఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి హాజరై వాస్తవ పరిస్థితిని వివరిస్తారా లేదా అన్నదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారం చేపట్టకముందు నుండి కాళేశ్వరంపైన జరుగుతున్న వివాదానికి సంబందించి అన్ని రాజకీయ పక్షాలు చర్చించనుండడంతో ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది . ఈ చర్చలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపేవిగా ఉంటాయనుకుంటున్నారు. ముఖ్యంగా ఉద్యమనాయకుడిగా పద్నాలుగేళ్ళు నిర్విరామ పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ళపాటు పాలన సాగించిన కెసిఆర్‌కున్న పేరు, ప్రతిష్టలు ఈ అసెంబ్లీ చర్చల సారాంశంపై ఆధారపడి ఉంటా యనుకుంటున్నారు. దాదాపు ఇరవై అయిదేళ్ళ బిఆర్‌ఎస్ పార్టీ మనుగడకూడా ఈ సమావేశ తీర్మానం పైన ఆధారపడి ఉంటుందన్న చర్చ కూడా జరుగుతున్నది.
కెసిఆర్ అరెస్టుపై..
పీసీ ఘోష్ నివేదికంతా కెసిఆర్ టార్గెట్ చేసేదిగా ఉందన్న వార్తలు వొస్తున్న నేపథ్యంలో కెసిఆర్ అరెస్టు తప్పదా అన్న చర్చకూడా జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ దూకుడుకూడా అవుననే విధంగానే ఉంది. దానికి తగినట్లు కాళేశ్వరంతోపాటు ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఎప్పుడైనా, ఎవరినైనా అరెస్టు చేయవొచ్చని, ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించినవేళ కెసిఆర్ అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిఉంది. అయితే గతంలో వోటుకు నోటు కేసులో నాడు తెలుగుదేశంపార్టీలో ఉన్న తనను అరెస్టుచేసి జైలుకు పంపిన కెసిఆర్‌పై ప్రతీకార చర్యల్లాంటివేమీ ఉండవని సిఎం రేవంత్‌రెడ్డి ఓ సందర్భంలో మీడియాతో చిట్‌చాట్‌లో పేర్కొన్న విషయం గమనార్హం.. ఇప్పటికే ఫామ్ హౌజ్‌లో తనకుతాను అరెస్టు అయిన కెసిఆర్‌ను తాను కొత్తగా అరెస్టు చేసేదేముందని ఆ సందర్భంలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నప్పటికీ రేపటి నుండి ప్రారంభంకానున్న అసెంబ్లీ చర్చలు ఎటుదారితీస్తాయోనన్న ఉత్కంఠ లో తెలంగాణ ప్రజలున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





