కాశ్మీర్‌ ‌మాజీ సిఎం ఫరూక్‌పై హత్యాయత్నం

-తృటిలో తప్పించుకున్న అబ్దుల్లా
-తనది 20 ఏళ్ల పగ అన్న దుండగుడు

జమ్ము, మార్చి 12: జమ్మూకశ్మీర్‌ ‌మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకలో నిందితుడు ఆయనపై కాల్పులకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమవడంతో.. ఫరూక్‌ ‌సురక్షితంగా బయటపడ్డారు. 20 ఏళ్లుగా తాను ఫరూక్‌ను చంపాలనుకుంటున్నానని నిందితుడు పోలీసులతో పేర్కొన్నాడు. బుధవారం జమ్మూ శివార్లలోని హోటల్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు ఫరూక్‌ అబ్దుల్లా హాజరయ్యారు. ఆయనతో పాటు జమ్మూకశ్మీర్‌ ‌డిప్యూటీ సీఎం సురీందర్‌ ‌ఛౌదరీ కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వెనక నుంచి ఫరూక్‌పై పాయింట్‌ ‌బ్లాంక్‌ ‌రేంజ్‌లో తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్నవారు వెంటనే అతడిని పట్టుకొని చితకబాదారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా తాజాగా వెలుగులోకి వచ్చాయి. నిందితుడు జమ్మూకి చెందిన 63 ఏళ్ల కమల్‌సింగ్‌ ‌జమ్వాల్‌గా పోలీసులు గుర్తించారు. జమ్మూలో దుకాణాలు నడుపుతోన్న కమల్‌ ‌విచారణ సమయంలో కీలక విషయాలు వెల్లడించాడు. గత 20 ఏళ్లుగా తాను ఫరూక్‌ అబ్దుల్లాను చంపాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. ఇది తన వ్యక్తిగత అజెండాగా వెల్లడించాడు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీకి లైసెన్స్ ఉన్నట్లు తెలిపాడు. ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తన తండ్రిపై జరిగిన హత్యాయత్నంపై జమ్మూకశ్మీర్‌ ‌సీఎం ఒమర్‌ అబ్దుల్లా  స్పందించారు. లోడ్‌ ‌చేసిన తుపాకీతో తన తండ్రిని ఓ వ్యక్తి కాల్చేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు. అయితే, భద్రతా సిబ్బంది అప్రమత్తతతో అది విఫలమైందన్నారు. ఫరూక్‌కు జెడ్‌ ‌ప్లస్‌ ‌భద్రత ఉన్న విషయాన్ని ఒమర్‌ ‌ప్రస్తావించారు. ఇంత భద్రత ఉన్నా.. నిందితుడు అంత దగ్గరగా ఎలా రాగలిగాడని ప్రశ్నించారు. ఇక, భద్రతా వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఉప ముఖ్యమంత్రి ఛౌదరి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *