Assam Elections: ప్రాంతీయ, అస్తిత్వ పోరాటంగా అస్సాం ఎన్నికలు ..!

“అస్సాంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బాగా ప్రభావం చూపనుంది. కొత్త వోటర్లతో పాటు భారీగా వోట్ల గల్లంతు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బోడోలాండ్లో ప్రాంతీయ పార్టీల వైఖరి, ఎగువ అస్సాంలో బీజేపీ ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష, దిగువ అస్సాంలో అస్తిత్వ పోరాటం ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. అదే సమయంలో స్వతంత్రంగా బరిలోకి దిగుతున్న 257 మంది అభ్యర్థుల్లో 88 మంది ముస్లిం అభ్యర్థులు ఉండడం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారనుంది. వీరివల్ల వోట్ల విషయంలో చీలిక వచ్చే అవకాశముంది.”

ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్ – 9866255355

ఈ సారి అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ప్రాంతీయ, అస్తిత్వ పోరుగా మారాయి. ఎగువ,మధ్య,దిగువ అస్సాం ప్రాంతాల మధ్య సంక్లిష్టమైన రాజకీయ గందరగోళం నెలకొంది. బంగ్లాదేశ్‌తో సరిహద్దు పంచుకుంటున్న ఈ రాష్ట్రంలో అస్తిత్వ రాజకీయాలు, భారీగా కొత్త వోటర్ల చేరికతో రాష్ట్రంలో సమీకరణలు ఆసక్తికరంగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో 34 శాతం మంది ముస్లిం జనాభా ఉంది. ఇప్పుడు అది 40 శాతానికి చేరినట్లు అంచనా.అయితే జనాభాపరంగా దిగువ అస్సాంతో పాటు బరాక్‌ వ్యాలీలోని కొన్ని నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్థుల ప్రాతినిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. గౌరీపూర్‌, జలేశ్వర్‌, చమారియా, చెంగా నియోజకవర్గాల్లో మాత్రమే ముస్లిం అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అస్సాంలోని 126 స్థానాల్లో ఎగువ అస్సాంలో 35,బోడోలాండ్ తో కల్పి మధ్య అస్సాంలో 41,దిగువ అస్సాంలో 50 సీట్లు ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో 126 స్థానాలకుగాను 23 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఎగువ అస్సాం బీజేపీ వశం కాగా దిగువ అస్సాంలో ఆపార్టీకి ,కాంగ్రెస్ కు భీకర పోరు సాగింది. మధ్య అస్సాం లో మాత్రం మధ్యే మార్గంగా సమానంగా ఆదరించింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 722 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 188 మంది ముస్లిం అభ్యర్థులు (దాదాపు 26 శాతం) ఉన్నారు.దీంతో ఏప్రిల్‌ 9న జరగనున్న వోటింగ్‌లో ముస్లింలు ఎవరికి వోటు వేస్తారనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా చూసుకుంటే అస్సాంలో అభ్యర్థుల భవితవ్యం ముస్లిం వోటర్లపైనే ఆధారపడి ఉంది. ప్రతి ప్రాంతానికి భిన్నమైన సామాజిక నేపథ్యం ఎవరికీ కల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎఐయుడిఎఫ్‌) అత్యధికంగా 87 శాతం ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపింది. అస్సాం గణ పరిషత్‌ (ఎజెపి) 46 శాతం మందిని బరిలోకి దింపింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) 32 శాతం, కాంగ్రెస్‌ 18 శాతం ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపాయి. కూటముల విషయానికొస్తే, కాంగ్రెస్‌ నేతత్వంలోని అస్సాం మహాజోత్‌ (ఎఎస్‌ఎం) 128 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా.. ఇందులో 22 మంది ముస్లింలు (17 శాతం) ఉన్నారు. మరోవైపు నార్త్‌ఈస్ట్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ కూటమి 127 మంది అభ్యర్థులను బరిలోకి దింపితే.. ఇందులో కేవలం 13 మంది మాత్రమే ముస్లింలు (10 శాతం) ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకుని ఉండే దిగువ అస్సాం ప్రాంతంలో గుర్తింపు, అస్తిత్వ రాజకీయాలదే ప్రధాన పాత్ర. 50 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంలో దుబ్రీ, బార్పేట, గోల్పారా వంటి ముస్లిం ప్రాబల్య జిల్లాలున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు 23 సీట్లు రాగా కాంగ్రెస్ కూటమి 27 స్థానాలతో పైచేయి సాధించింది.ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు బలమైన పట్టుంది. అస్సాంలో ఏఐయూడీఎఫ్ గెలిచిన 16 సీట్లలో అత్యధికం ఇక్కడే కావడం విశేషం. ఈసారి మాత్రం దిగువ అస్సాంలో కాంగ్రెస్ కూటమికి బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది.బీజేపీకి కంచుకోట అయిన ఎగువ అస్సాంలో హ్యాట్రిక్ ఆశలకు ఎగువ ప్రాంతమే అత్యంత కీలకం కానున్నది తినుసుకేయా, శివసాగర్, డిబ్రూగఢ్, జోర్హాట్ వంటి కీలక జిల్లాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడి 35 అసెంబ్లీ స్థానాల్లో 2021 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 30 సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటింది. కాంగ్రెస్ కూటమి 5 స్థానాలకు పరిమితమైంది. డీలిమిటేషన్ తర్వాత ఈ ప్రాంతంలో గిరిజన జనాభా శాతం పెరగడం బీజేపీకి మరింత కలిసొచ్చే అంశం.

ఈసారి ఎన్నికల్లో మధ్య అస్సాం నగావ్, మోరిగావ్తో పాటు బోడోలాండ్ ప్రాంతం అత్యంత కీలకంగా మారింది.ఇక్కడ 41 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో కుల, ప్రాంతీయ రాజకీయాల ప్రభావం మరీ ఎక్కువ. పలు స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కింగ్ మేకర్లు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి 22, కాంగ్రెస్ కూటమి 16, యూపీపీఎల్, బీపీఎఫ్ వంటి ప్రాంతీయ పార్టీలు3 స్థానాలు నెగ్గాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో ఈ ప్రాంతం రాజకీయంగా సరికొత్త రూపు సంతరించుకుంది. చాలా అసెంబ్లీ స్థానాల సరిహద్దులు మారిపోయాయి. ఎస్టీ రిజర్వుడ్ స్థానాల సంఖ్య పెరిగింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు ముక్కలయ్యాయి. అస్సాంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బాగా ప్రభావం చూపనుంది. కొత్త వోటర్లతో పాటు భారీగా వోట్ల గల్లంతు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బోడోలాండ్లో ప్రాంతీయ పార్టీల వైఖరి, ఎగువ అస్సాంలో బీజేపీ ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష, దిగువ అస్సాంలో అస్తిత్వ పోరాటం ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. అదే సమయంలో స్వతంత్రంగా బరిలోకి దిగుతున్న 257 మంది అభ్యర్థుల్లో 88 మంది ముస్లిం అభ్యర్థులు ఉండడం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారనుంది. వీరివల్ల వోట్ల విషయంలో చీలిక వచ్చే అవకాశముంది. అస్సాం జనాభాలో మూడింట ఒక వంతు ముస్లింలు ఉన్నప్పటికీ, అధికార పార్టీ అభ్యర్థుల జాబితాలో జనాభాతో పోలిస్తే అస్సాంలో ముస్లిం ప్రాతినిధ్యం తక్కువే అని చెప్పొచ్చు.ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే..ఎన్నికల వేళ సనాతన ధర్మం పేరుతో ఏజేపీ అభ్యర్థి కుంకీ చౌదరి లక్ష్యం గా ‘బీఫ్’ గొడవ తెరపైకి తెచ్చి రగడ సృష్టిస్తుంది. బీజేపీ ప్రకటించిన 90 మంది అభ్యర్థుల్లో ఒక్క ముస్లిం కూడా లేకపోవడం గమనార్హం .

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయినప్పటికీ రాజకీయ వేడి రంజుగా మారింది. ఒకానొక సమయంలో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకే అయినప్పటికీ ముగ్గురు గొగోయ్ లతో సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో హ్యాట్రిక్ మిస్ అవుతుందోనేమోనని బెంగ మొదలైంది. అయితే కాంగ్రెస్ కూటమి ప్రాంతీయ ,అస్తిత్వ రాజకీయాలను ఆయుధంగా వాడుకునే వ్యూహం తో ముందుకు సాగుతున్నది. ప్రాంతీయ శక్తులను, లెఫ్ట్ పార్టీలను ఏకతాటిపై తెచ్చి బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తుందంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ నేత గౌరవ్, దళితనేత అఖిల్, ఏజేపీ నేత లూరింజ్యోతి ఎలాగైనా బీజేపీ కి అధికారం దక్కనీయొద్దని ఒక్క అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనుకకు అన్నట్లుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు బీజేపీ పాడే రాగం పాడుతూనే ఉన్నది. కాంగ్రెస్ నేత గౌరవ్ పాకిస్తాన్ కు వెళ్లి వచ్చాడని హిమంత శర్మ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ వైరుధ్యం నాడు 2015లో హిమంత పై అవినీతి ఆరోపణలు రావడం, గౌరవ్ గొగోయ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరమీదకు రావడం,కాంగ్రెస్ ను వంచించి బీజేపీతో చేతులు కల్పి అధికారంలోకి వచ్చారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మాత్రం ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు అర్థం అయ్యే రీతిలో ప్రసంగాలు కొనసాగిస్తున్నారు. అస్సాం ప్రజల గుర్తింపు పరిరక్షణ కోసం తాము ఎన్నికల్లో పోరాడుతున్నామని చెబుతున్న హిమంత బిశ్వ శర్మ విమర్శలను ప్రతిపక్షాలు తిప్పికొడుతున్నాయి. పాలనలో లోపాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చేసే ప్రయత్నమని మండిపడుతున్నాయి. హిమంత బిశ్వ శర్మ కార్పొరేట్లకు దోచిపెట్టేవిధంగా లక్ష ఎకరాల భిఘాల భూములు బీజేపీకి ఏటీఎం గా మార్చినారనే విపక్షాల ప్రచారం కల్సి వస్తే బీజేపీ హ్యాట్రిక్ దరి చేరదనే అభిప్రాయాన్నిరాజకీయ విశ్లేషకులు వెల్లడించారు.హిందుత్వ ఎజెండాతో వోటర్లను ఏకతాటిపై తెస్తూ, నయానో, భయానో 40శాతం ఉన్న ముస్లిం వోటర్లలో చీలికలు తెచ్చి లబ్ది పొందే ప్రయత్నం ముమ్మరం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *