ఆశావహుల దృష్టి కో ఆప్షన్‌ పదవుల వైపు

– ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు
– మున్సిపాలిటీల్లో సందడి షురూ

సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: మున్సిపల్ పాలకవర్గాలు కొలువుదీరడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల పదవులపై ఆశావహుల దృష్టి మ‌ళ్లింది. ఇంతకాలం పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పుడు కో ఆప్షన్ పదవుల కోసం ముమ్మ‌ర‌ ప్రయత్నాలు మొద‌లు పెట్టారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఈ పదవులను ఆశిస్తున్న నేతలు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎలాగైనా పదవి దక్కించుకోవాలనే లక్ష్యంతో రాజకీయ చర్చలు, ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. పాలకవర్గం మొదటి సమావేశం జరిగిన 90 రోజుల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంది.

కౌన్సిలర్ పదవితో సమాన హోదా..

ప్రజలు నేరుగా ఎన్నుకున్న కౌన్సిలర్లతో సమాన హోదా ఉండడంతో కో ఆప్షన్ సభ్యుల పదవికి డిమాండ్ ఏర్పడింది. కౌన్సిల్లో మెజార్టీ సభ్యులు వీరిని ఎన్నుకోనున్నారు. పాలకవర్గం ఉన్నంత కాలం కోఆప్షన్ సభ్యులు కూడా కొనసాగుతారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి వీరికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరికి గౌరవ వేతనం కూడా ఉంటుంది. అలాగే మున్సిపల్ పాలనపై చర్చించే అధికారాలు ఉంటాయి. కానీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలతో పాటు అభివృద్ధి పనుల తీర్మానాల సమయంలో ఓటు వేసే హక్కు వీరికి ఉండదు. వరుసగా మూడు సమావేశాలకు వీరు హాజరు కాకపోతే వారి సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది.

ఒక్కో మున్సిపాలిటీలో నలుగురు..

ఒక్కో మున్సిపాలిటీలో నలుగురు కో ఆప్షన్ సభ్యులు ఉంటారు. వీరి ఎంపికలో పలు నిబంధనలు ఉన్నాయి. పరిపాలన అనుభవం కలిగిన వారికి పదవులు ఉంటాయి. అందులో ఒకటి మహిళకు రిజర్వ్‌ చేస్తారు. కో ఆప్షన్ పదవికి దరఖాస్తు చేసేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఓటరు జాబితాలో రిజిష్టర్ అయి ఉండడంతోపాటు 21 ఏళ్ల‌కు తగ్గకుండా వయస్సు కలిగి ఉండాలి. మున్సిపల్ కౌన్సిల్లో చైర్మన్ మొదలుకొని వార్డు సభ్యుడి వరకు ఎందులోనైనా ఐదు సంవత్సరాలకు తగ్గకుండా పాలన సాగించి ఉండాలి. ఇందులో మైనార్టీ వర్గానికి రెండు పోస్టులు కేటాయిస్తారు. అందులో కూడా ఒక పోస్టును మహిలకు రిజర్వు చేస్తారు. ఆశావహులు అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన వారై ఉండాలి. అన్ని అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారాలతోపాటు రుజువు పత్రాలతో నిర్ణీత తేదీలోపు కమిషనర్ కార్యాలయంలో అందజేయాలి. మైనారిటీ వర్గాలకు చెందిన వారు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలు, పురపాలనలో అనుభవం, నైపుణ్యం కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లేదా పట్టణ ప్రణాళికా విభాగంలో పనిచేసి గెజిటెడ్ అధికారి హోదాలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఐదేళ్లకన్నా తక్కువ కాకుండా చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు సభ్యుడిగా పని చేసిన మాజీ ప్రజాప్రతినిధులు కో ఆప్షన్ సభ్యుల పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని Aspirants’ focus on co-option pos సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులుగా అయిదేళ్లు పని చేసిన ప్రజాప్రతినిధులు అర్హులు.

ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు

కో ఆప్షన్ పదవులు ఆశించేవారు ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యేలు హామీ ఇచ్చిన వారితోనే కో ఆప్షన్ పదవుల భర్తీ ఉండటంతో ఆశావహులు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరికి ఎమ్మెల్యేలు కో ఆప్షన్ పదవులు ఇస్తామని హామీ సైతం ఇచ్చారు. ఎన్నికల్లో కౌన్సిలర్ల టికెట్లు త్యాగం చేసిన వారికి, ఒకేచోట ఇద్దరు, ముగ్గురు బరిలో ఉన్న స్థానాల్లో ముఖ్యులకు పలువురికి కో ఆప్షన్ పదవుల పేరుతో బుజ్జగించారు. ఎమ్మెల్యేల హామీతో కౌన్సిల్ బరి నుంచి తప్పుకున్న వారు ప్రస్తుతం కో ఆప్షన్ పదవులు ఆశిస్తున్నారు. దీంతో అలాంటి వారికి ఎమ్మెల్యేలు కో ఆప్షన్ పదవులు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *