Take a fresh look at your lifestyle.

అ‌ప్రమత్తమైన ప్రభుత్వాలు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ‌భారతదేశంలో విస్తృతంగా విజృంభి స్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలకు తోడు మరింత కఠినతరమైన చర్యలు తీసుకుంటేగాని, ఈ వైరస్‌ ‌విస్తరణను నిలపలేమన్న నిర్ణయానికి ప్రభుత్వాలు వొచ్చాయి. ఇప్పటికే వివిధ దేశాల నుండి వొచ్చిపోయే ప్రయాణీకులపై కొన్ని నిబంధనలు అమలుపర్చినా, దేశంలోకి వైరస్‌ ‌విస్తృతమవుతుండడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళన కలిగిస్తున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాలన్నిటి రాకపోకలను వారం రోజుల పాటు నిలిపి వేస్తున్నట్లు గురువారం సాయంత్రం ప్రకటించింది. కొన్ని దేశాల ప్రయాణీకులను అనుమతించిన నేపథ్యంలో వారి నుండే ఈ వ్యాధి సోకుతున్న విషయాన్ని కేంద్రం గ్రహించింది.

ఇప్పటివరకు ఇండియాలో మరణించిన వారంతా ఇతర ప్రాంతాలనుండి వొచ్చినవారే కావడం ఈ నిర్ణయానికి కారణంగా మారింది. అందుకు ఈ నెల 22నుండి 29వ తేదీవరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఆరవై అయిదు ఏళ్ళు పైపడిన వారు, పదిఏళ్ళ వయస్సు లోపున్నవారెవరూ బయ• తిరగవద్దంటూ కేంద్ర ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు మరణించినవారి వయస్సు ఆరవై ఏళ్ళకు పైగా ఉండడం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా కనిపిస్తున్నది. దానికి తోడు వివిధ రాష్ట్రాల మధ్య నడుస్తున్న రైళ్ళను కూడా రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 98 రైళ్ళను రద్దుచేసిన ఇండియన్‌ ‌రైల్వే తాజాగా ఈ నెల 20వ తేదీనుండి దేశవ్యాప్తంగా మరో 168 రైళ్ళను రద్దుచేయాలని నిర్ణయించింది. అత్యవసర సేవలకు సంబంధించిన వారు మినహా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు ఇంటినుండే పనిచేయాలని ఆదేశాలు జారీచేసింది.

ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం కూడా మరిన్ని అత్యవసర చర్యలు తీసుకునేందుకు మంత్రిమండలి, ఉన్నతాధికారులతో విస్తృత చర్చలు జరిపింది. కరీంనగర్‌లో కరోనా వైరస్‌కు సంబంధించి ఏడు పాజిటివ్‌ ‌కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అలర్ట్ అయింది. ఇండోనేషియాకు చెందిన ఓ బృందం కరీంనగర్‌జిల్లాలో పర్యటించిన ప్రాంతాలన్నిటినీ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయానికి మూడుకిలోమీటర్ల పరిధినంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక విధంగా ఆ ప్రాంతాన్నంతా దిగ్భదించారనే చెప్పాలె. ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారినెవరినీ బయటికి వెళ్ళకుండా, బయటివారెవరూ ఆ ప్రాంతానికి వెళ్ళకుండా చర్యలు తీసుకుంటున్నారు. దానికితోడు 144వ సెక్షన్‌ను కూడా విధించడంతో ఒక విధంగా కరీంనగర్‌ ‌జిల్లా కేంద్రమైతే కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నది. కరీంనగర్‌లో హోటళ్ళు, దుకాణాలను బంద్‌ ‌చేయించారు. కరోనా సోకిన వారు తిరిగిన ప్రాంతాలన్నిటిని రసాయనాలతో శుభ్రపరుస్తున్నారు. దీనికితోడు జిల్లా కేంద్రంలోనే 20 వరకు ఐసోలేషన్‌, ‌పది ఐసియు పడకలను ఏర్పాటుచేశారు, అలాగే రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లోకూడా 50 చొప్పున వీటికోసం ప్రత్యేకంగా పడకలను ఏర్పాటుచేశారు.

అత్యవసర చికిత్సలను అందించేందుకు ర్యాపిడ్‌ ‌రెస్పాన్స్ ‌బృందాలనుకూడా ఏర్పాటుచేస్తున్నారు. పరిస్థితులు ఇంత సీరియస్‌గా ఉండడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలను ప్రకటించింది. రాష్ట్ర సిబ్బందిని మరింత అప్రమత్తంచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపైనే సుదీర్ఘంగా చర్చజరిగింది. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ ‌సెంటర్లు, సినిమాహాల్స్‌లన్నిటిని ఈనెల చివరివరకు మూసేయాలని ఆదేశాలు జారీ చేసిన దరిమిలా పబ్లిక్‌ ఎక్కువగా వచ్చే సంస్థలన్నీ మూతపడ్డాయి. కాని, రాష్ట్రాన్నంతా కరీంనగర్‌ ‌సంఘటన భయాందోళనకు గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నా కరీంనగర్‌లో ఒకేసారి ఏడుకేసులు నమోదవడం ప్రభుత్వాన్ని కూడా ఆందోళనపరుస్తున్నది. ఇటలీలాంటి దేశంలో బుధవారం ఒక్కరోజే సుమారు నాలుగు వందలమంది మృతిచెందిన సంఘటన మీడియాలో హల్‌చెల్‌ ‌చేయడం చూస్తుంటే ప్రజలు భయకంపితులవుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదివేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరిన్ని సత్వరచర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించింది.

Leave a Reply