ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ‘అరైవ్ అలైవ్’

– 13 నుంచి రాష్ట్రవ్యాప్త క్యాంపెయిన్!
– రోడ్డు భద్రతపై జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
– అతి వేగం, వాహనాల పెరుగుదలే ప్రమాదాలకు కారణం
– పాదచారులు, ద్విచక్ర వాహనదారుల రక్షణే లక్ష్యం
– డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతపై తగిన చర్యలను చేపడుతున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామక ష్ణారావు తెలిపారు. వాహనాల సంఖ్య పెరగడం, అతి వేగంతో డ్రైవింగ్ ఇందుకు కారణమని పేర్కొన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం అమలుపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు రోడ్డు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పరిష్కారాలను  కనుగొనాలని ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాలను తక్షణమే నిర్వహించి, వారాంతర అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. దీనిలో స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘అరైవ్-అలైవ’ను నిర్వహించనున్నట్లు, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల ప్రాణాలను రక్షించడం, రాష్ట్రవ్యాప్తంగా సురక్షిత రహదారులను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని సీఎస్ తెలిపారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం సాధారణమైనది కాదని, ఇది పలు శాఖల సమన్వయంతో కూడిన సమగ్ర చర్య అని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులే బాధితులవుతున్నారని, దీనిపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టడం అత్యవసరమని అన్నారు. గత మూడు నెలల్లో రోడ్డు భద్రతా చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు.

కార్యక్రమ షెడ్యూల్ ఇలా..

13వ తేదీన గ్రామస్థాయి రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు, 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా నాయన విగ్రహాల వద్ద రోడ్డు భద్రత ప్రమాణం చేయించడం, 15న ‘చిల్డ్రన్ రోడ్ సేఫ్టీ డే- నాలుగేళ్లకు పైబడిన పిల్లలకు సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. 16న ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు- హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడం, అలాగే సోషల్ మీడియాలో అవగాహన సందేశాలు, ఫొటోలు పంచుకోవడం, 17న ప్రమాదాల అనంతరం తక్షణ సహాయం మెరుగుపరచడానికి ‘గోల్డెన్ అవర’పై అత్యవసర స్పందన శిక్షణ కార్యక్రమాలుచ, 18న ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు కౌన్సెలింగ్ కార్యక్రమాలు-ప్రవర్తనలో మార్పు, ట్రాఫిక్ నియమాలు పాటించడంపై దృష్టి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రధాన కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, జీహెచఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక, జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *