మహా శివరాత్రి వేడుకలకు ఆల‌యాలు ముస్తాబు

– వేములవాడలో నేటి నుంచే రాజన్న జాతర
– భీమేశ్వరాలయంలో భక్తుల కోసం సకల సౌకర్యాలు

వేములవాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలను ముస్తాబు చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిచెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం, వరంగల్ వేయి స్తంభాల గుడి తదితర క్షేత్రాల్లో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో శనివారం నుంచి ఈ నెల 16 వరకు నిర్వహించే ఈ మహా జాతర కోసం దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. రాజన్న సన్నిధిలో ధర్మగుండాన్ని ఆధునికీకరిస్తున్న నేపథ్యంలో భక్తుల స్నానాలు చేసేందుకు వీలుగా పార్కింగ్ ప్రదేశంలో 400 షవర్స్, దుస్తులు మారేÁT్చకునేందుకు గదులు ఏర్పాటు చేశారు. వేములవాడకు వచ్చే భక్తులు రోజంతా జాగరణ చేసి తెల్లవారుజామున ఉపవాసాలు విరమిస్తారు. అనంతరం భీమేశ్వర స్వామివారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించి కోడె మొక్కు, ఎత్తు బెల్లం చెల్లించుకుంటారు. టెంకాయలు కొట్టి బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇందుకోసం భీమేశ్వరాలయంతోపాటు బద్దిపోచమ్మ, ఇతర అనుబంధ ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు.

భక్తులకు సౌకర్యాలు

భక్తులకు ఇబ్బందులు లేకుండా స్వామి వారిని సులభంగా దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు, పోలీసు భద్రత, తాగునీటి, వైద్య సౌకర్యం, హెల్ప్ డెస్క్, పారిశుధ్య నిర్వహణ, సైన్ బోర్డులు, తదితర ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని క్యూలైన్‌లలో తాగునీరు, మజ్జిగ సౌకర్యం కల్పిస్తున్నారు. భక్తులకు అల్పాహారం, ఉప్మా, పులిహోర తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న రెండు కల్యాణ కట్టలు కాకుండా అదనంగా ఏర్పాటు చేశారు. వేములవాడలో 48గంటలపాటు మద్యం విక్రయాలను బంద్ చేశారు. కరీంనగర్ రిజీయన్ నుంచే కాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన 14 డిపోల నుంచి వేములవాడకు 600 ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రూప కల్పన చేశారు. భక్తులను చేరవేసేందుకు తిప్పాపూర్ ప్రధాన బస్టాండ్‌తోపాటు చెరువు కట్టకింద తాత్కాక బస్టాండ్ ఏర్పాటు చేశారు. బస్టాండ్ నుంచి ఆలయం వరకు భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. బస్టాండ్‌లలో విద్యు ద్దీపాలు, బారికేడ్లు, సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే 24గంటలపాటు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా అత్యవసర వైద్య సహాయం కోసం అంబులెన్స్‌లు, రెస్క్యూ టీం, వీల్‌చైర్స్, స్ట్రెచర్‌లు అందుబాటులో ఉంచారు. 30మంది డాక్టర్లు, 130 మంది పారా మెడికల్ సిబ్బందిని సిద్దంగా ఉంచారు. పారిశుధ్య నిర్వహణకు వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల మున్సిపాలిటీ నుంచి సిబ్బందిని అందుబా టులో ఉంచారు. వీరేకాకుండా అదనంగా 400మంది పారిశుధ్య కార్మికులను సిద్ధం చేశారు. మహాశివరాత్రి జాతరలో 24గంటలు విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేశారు. వివిధ సబ్‌స్టేషన్‌ల నుంచి వేములవాడ దేవస్థానానికి విద్యుత్ సరఫరా అయ్యే విధంగా 15 రోజులుగా ఫీడర్‌లను కలిపారు. ఇందు కోసం 50మంది సెస్ సిబ్బంది అందుబా టులో ఉంచారు. దేవస్థానం పరిసరాల్లో అగ్నిప్రమాదాల నివారణకు 5 అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఏకాంతంగా మహా లింగార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. భీమేశ్వరాలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రధానంగా శివ దీక్ష స్వాములు దీక్షలు విరమించేందుకు వీలుగా సిద్ధం చేశారు. వేములవాడ పురప్రముఖులు శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి 3గంటల వరకు అభిషేక దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *