నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా??

– పింఛ‌ను అడిగితే తిడ‌తావా?
– మెద‌క్ జిల్లా క‌ల నెర‌వేర్చింది కేసీఆర్‌
– 11వ తేదీలోగా రైతు బంధు ప‌డాలి
– రాజీనామా చేయ‌మంటే జిరాక్స్ కాపీ పంపావు
– జిల్లాను అభివృద్ధి చేసింది బీఆర్ ఎస్సే
– రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

మెద‌క్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 4: అవ్వతాతలు రూ.4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్ అని అడిగితే లాగుల తొండలు వదులుతా అంటావా అంటూ హ‌రీష్‌రావు విరుచుకుప‌డ్డారు. మెద‌క్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశంలో బుధ‌వారం ఆయ‌న ప్ర‌సంగిస్తూ బాండ్ పేపర్లు రాసిచ్చి, అమ్మతోడు అని చెప్పి మోసం చేశావు కదా.. ఆడబిడ్డలు మహాలక్ష్మి రూ.2500 అడిగితే ‘పేగులు తీసి మెడలో వేసుకుంటా’ అంటావా? ఇదేనా నీ సంస్కారం? నీ రౌడీయిజం సాగదు.. ఖబర్దార్ అని హెచ్చ‌రించారు. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులను గడ్డిపోచల్లా విసిరేసిన మహనీయుడు కేసీఆర్. కెసిఆర్ చెబితే మేము కూడా పదవులకు రాజీనామా చేసి ఆంధ్రా పాలకుల ముఖం మీద కొట్టినం. మరి నువ్వు? రాజీనామా చేయమంటే జిరాక్స్ పేపర్ పంపిన దొంగవు.  తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన ద్రోహివ‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చారు కాబట్టే నువ్వు ఈరోజు సీఎం కుర్చీలో ఉన్నావు. లేకపోతే ఆంధ్రాలో మోచేతి నీళ్లు తాగుతూ, బ్యాగులు మోసుకుంటూ బతికేవాడివ‌న్నారు.  కాంగ్రెస్ పార్టీకి గెలిచే సత్తా ఉంటే మా అభ్యర్థులను ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? జనం మీకు ఓటు వేయరని అర్థమై.. పోలీసులతో బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కండువాలు కప్పుతున్నారు.  ఎవరెవరు అమ్ముడుపోతున్నారో, ఎవరు ఎందుకు ఎత్తుకుపోతున్నారో అందరినీ గుర్తుపెట్టుకుంటాం. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామ‌న్నారు. ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 11వ తేదీలోగా రైతు బంధు పడకపోతే.. రైతులు నీ చెడ్డీల తొండలు తొడిగి ఏడిపిస్తారు. నిన్ను చీరిచింతకు చెండాడుతారు. రుణ మాఫీ పేరుతో దేవుళ్లనే మోసం చేసిన ఘనుడివి నువ్వు. నీ అబద్ధాలను రైతులు నమ్మే స్థితిలో లేరు. మెదక్ జిల్లా కల నెరవేర్చింది కేసీఆర్. ఇక్కడికి కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, రైలు, నాలుగు లైన్ల రోడ్డు తెచ్చింది కేసీఆర్. ఘనపూర్ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది మేము. సిద్దిపేటతో సమానంగా మెదక్‌ను అభివృద్ధి చేశాం. కాంగ్రెస్ వచ్చాక ఇక్కడ ఒక్క రూపాయి పని జరగలేదు. మెదక్‌లో ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు. ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు మీ హరీష్ అన్న ఉన్నాడు.. నేను చూసుకుంటా. కాంగ్రెస్ గుండా రాజకీయాన్ని, మోసాలను ఎండగట్టండి. బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్‌లో గుండు సున్నా ఇచ్చారు. కాబట్టి కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. మెదక్ అభివృద్ధిని కొనసాగిద్దామ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *