– కేసీఆర్ నైతికత పాటించారా?
– ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారే
– స్పీకర్ తీర్పుఅనంతరం కడియం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11 : అనర్హత పిటిషన్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వాగతించారు. ప్రస్తుతం తాను బీఆర్ ఎస్‌లోనే ఉన్నానని, నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో తనకు సిద్దాంతపరంగా విభేదాలు ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎదుర్కొంటానని, ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కడియం ధీమా వ్యక్తం చేశారు. తనపై అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ తీర్పు అనంతరం ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో జరిగిన ఫిరాయింపులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నైతిక విలువలు తనకు మాత్రమే వర్తిస్తాయా.. కేసీఆర్‌కు వర్తించవా అని ప్రశ్నించారు. కేసీఆర్ తన హయాంలో జరిగిన ఫిరాయింపులకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ క్షమాపణ చెబితే తాను రాజీనామాకు సిద్ధం అని స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేసీఆర్ మంత్రులుగా చేయలేదా అని ప్రశ్నించారు. టీడీపీ శాసనసభా పక్షం బీఆర్ఎస్‌లో విలీనం కాకముందే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రిని చేశారని, ఇది నైతికమా అని సవాల్ విసిరారు. రాజకీయంగా తమను ఎదగకుండా చేయడానికే కేసీఆర్ జిల్లాల విభజన చేశారని కడియం ఆరోపించారు. ఎంతో చరిత్ర ఉన్న వరంగల్‌ను ఆరు జిల్లాలుగా చేయడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని సిద్దాంతపరంగా విభేదించాననిన్నారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవ్వడానికే తన స్థానంలో సబితను విద్యాశాఖ మంత్రిని చేశారని ఆరోపించారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు తాను వ్యతిరేకమని, అన్ని విషయాలు త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


