సమన్వయంతో భద్రాద్రి వేడుకలు విజయవంతం

– జిల్లా యంత్రాంగానికి దేవాదాయ శాఖ కమిషనర్ అభినందన

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : భద్రాచలంలో రెండు రోజులపాటు జరిగిన శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం వేడుకలు విజయవంతంగా నిర్వహించారని దేవాదాయ శాఖ కమిషనర్ హ‌నుమంత‌రావు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. స్వామివారి వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించుటలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు కల్పించారన్నారు. మహోత్సవ వేడుకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసిన పాత్రికేయులను కూడా అభినందించారు. వేడుకలు తిలకించేందుకు దేవస్థానం ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేకంగా టికెట్ విక్రయాలు చేపట్టడంపై అభినందనలు తెలిపారు. స్వామివారి వేడుకలు వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించామని, భద్రాచలం రాలేని భక్తులు ప్రపంచవ్యాప్తంగా టీవీలు, సోషల్ మీడియా ద్వారా వీక్షించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారని ఆయ‌న‌ తెలిపారు. శ్రీరామనవమి రోజున కళ్యాణం ముగిసిన తదుపరి భద్రాచలంలో 80 తలంబ్రాల కౌంటర్లు ఏర్పాటు ద్వారా, అలాగే ఆర్టీసీ బస్సులలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న స్వామి వారి తలంబ్రాలు కొరియర్, పోస్టల్, కార్గో ద్వారా పొందేందుకు దేవస్థానం భక్తులకు అవకాశం కల్పించిందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి వచ్చిన భక్తులకు స్వచ్చంద సంస్థలు పెద్ద ఎత్తున సేవలందించి మంచినీళ్లు, మజ్జిగ, అన్నదానం చేశాయంటూ సంస్థల సిబ్బందిని హ‌నుమంత‌రావు కొనియాడారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *