రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 1: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి అర్హమైన అన్నింటినీ సానుకూలంగా పరిష్కరించాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి అవసరమైన డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలన్నింటినీ ఒకే డాక్యుమెంట్‌గా భూభారతి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. తిరస్కరణకు గురైన దరఖాస్తులను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో ఆ వివరాలను లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారులకు అందించాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 594 మండలాల్లో 10,226 రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఇందులో 8,27,230 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు 7,98,528 దరఖాస్తులను డాటా ఫార్మేట్‌లో భూభారతి పోర్టల్‌లో నమోదు చేసినట్లు వివరించారు. మిగిలినవాటిని ఒకటి రెండు రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. భూభారతి చట్టం ద్వారా దశాబ్దకాలంగా పెండిరగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఏప్రిల్ 17 నుంచి జూన్ 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహించినట్లు మంత్రి వివరించారు. సర్వే నెంబర్లలో లోపాలు పిపిబి, ఆర్వోఆర్, నాలా, ఆర్‌ఎస్‌ఆర్ సవరణ, అప్పీల్స్, కోర్టు కేసులు, పోడు భూములు తదితర 30 రకాల భూ సమస్యలపై 8.27 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇవన్నీ పరిశీలిస్తే ధరణి పోర్టల్ మూలంగా ప్రజానీకం ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు కళ్లకుకట్టినట్లు కనబడుతున్నాయన్నారు. కింది నుంచి పైస్ధాయి వరకు రెవెన్యూ యంత్రాంగం మొత్తం ప్రత్యేక ఎజెండాగా తీసుకొని సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.





