నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించాలి

– రాష్ట్ర సమాచార కమిషనర్‌ బోరెడ్డి అయోధ్య రెడ్డి
– హనుమకొండలో అధికారులతో సమీక్ష

హనుమకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశం అని రాష్ట్ర సమాచార కమిషనర్‌ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో సమాచార హక్కు చట్టం, అప్పీళ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులు తమతమ శాఖల పరిధిలో సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుల సంఖ్య, పరిష్కరించిన, ఇంకా పరిష్కరించాల్సిన వాటి గురించి సమాచార కమిషనర్‌కు వివరించారు. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ బోరెడ్డి అయోధ్య రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు కమిషన్‌ ప్రజలలో ఒక భాగమని పేర్కొన్నారు. ప్రజలు తమకు సమాచారం కావాలని ఇచ్చే దరఖాస్తులను ప్రభుత్వ కార్యాలయాల్లో పౌర సమాచార అధికారులు స్వీకరించాలన్నారు. వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. చట్ట ప్రకారం దరఖాస్తుదారుకు నిర్ణీత గడువులోగా సమాచారాన్ని అందజేయాలన్నారు. సమావేశంలో ఆదనవు కలెక్టర్‌ వెంకట్‌ రెడ్డి, డిఆర్‌ఓ గణేష్‌, ఆర్డీవో రమేష్‌ రాథోడ్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

చట్టం పటిష్టంగా అమలైతేనే పథకాలు సద్వినియోగమవుతాయి

మీడియా సమావేశంలో అయోధ్యరెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలు కావడం ద్వారానే ప్రభుత్వ పథకాలు ప్రజలకు సద్వినియోగం అవుతాయన్నారు. ఈ క్రమంలో సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన దరఖాస్తుల ప్రకారం రాష్ట్రంలోని జిల్లాలను వర్గీకరించి వాటి పరిష్కారానికి సమీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మే 2024 నుండి ఇప్పటివరకు సుమారు ఐదు వేల దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. సమాచారం ఆలస్యం చేయడం అంటే న్యాయం జరగకపోవడమేనన్నారు. సమాచార కమిషనర్ల బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో పెండిరగ్‌లో ఉన్న సమాచార హక్కు చట్టం దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించినట్లు చెప్పారు. 13 ప్రభుత్వ శాఖలకు సంబంధించి దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించామన్నారు. హనుమకొండ జిల్లాలో 340 దరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయని, 46 దరఖాస్తులను ఇప్పటికిప్పుడు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మిగతా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరింస్తామన్నారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే మార్చి నాటికి పెండిరగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సమాచార కమిషన్‌ 17 జిల్లాల్లో పర్యటించిందని, ఆ జిల్లాల్లో సమాచార దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించామని, మిగతా జిల్లాల్లోనూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించనున్నట్లు చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *