ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

– విప‌రీతంగా అప్పులు చేస్తున్న ప్ర‌భుత్వం
– యూరియా సంక్షోభంపై ప్ర‌భుత్వ వైఖ‌రి అనుమానాస్ప‌దం
– ఫిరాయింపుల‌పై సుప్రీంకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు
– బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌

గజ్వేల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5:  దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో పెట్టామని కానీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, గతంలో ఉన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తమకు పరిపాలన చేతకావడం లేదని, అన్ని కార్యక్రమాలను అమలు చేయలేమని నేరుగా చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన కేవలం 21 నెలల్లోనే ప్రజల నుంచి సంపూర్ణ వ్యతిరేకతను మూటగట్టుకున్న‌ద‌న్నారు. హామీల వైఫల్యం, నమ్మకద్రోహం ఒక కారణం అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల తీరు, వ్యవహార శైలి మరో ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 2.80 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. అయితే, ఈ 21 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 2.20 లక్షల కోట్ల పైగా అప్పులు చేసిందని, ఆ అప్పుతో ఏ ఒక్క సంక్షేమ పథకం లేదా అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20 వేల కోట్ల అప్పు చేస్తే, ఈ ప్రభుత్వం నెలకు రూ. 20 వేల కోట్ల అప్పు చేస్తోందని ఆరోపించారు. యూరియా సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు దారితీస్తోందన్నారు. రాష్ట్రంలో జరిగిన ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. ఈ ఎన్నికల్లో బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ హెచ్చరించారు. పోచారం ఎమ్మెల్యే పదవి కూడా పోయే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత పోచారం పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దయనీయమైన స్థితిలో ఉన్నారని, కానీ బీఆర్ఎస్‌లో ఉన్న ప్రతి కార్యకర్త గర్వంగా తెలంగాణ తెచ్చిన పార్టీలో ఉన్నామని చెప్పుకోవచ్చని కేటీఆర్ అన్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో శుక్రవారం జరిగిన  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, వందలాది కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. వీరిలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కోటగిరి వల్లేపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ బాన్సువాడ నార్ల రత్న కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొట్టె గజేందర్, మాజీ సర్పంచులు పద్మ మొగులయ్య, బంజా గంగారాం, కురలేపు నగేష్, మాజీ కో-ఆప్షన్ హకీమ్ తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *