– తిరుపూరు పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్‌బాబు
తిరుపూరు, సెప్టెంబర్ 9: తెలంగాణలో దుస్తుల (అప్పెరల్) పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తమిళనాడులోని తిరుపూరు దుస్తుల తయారీ పరిశ్రమల యాజమాన్యాలను ఆహ్వానించారు. ఇక్కడి ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లో వస్త్ర పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రపంచస్థాయి మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కోయంబత్తూరు, తిరుపూరులను ఆయన మంగళవారం సందర్శించిన సందర్భంగా అక్కడి పారిశ్రామికవర్గాలు, ఎగుమతిదారులతో మాట్లాడారు. అతిపెద్ద అప్పెరల్ తయారీ కేంద్రంగా తిరుపూరు గ్లోబల్ లీడర్‌గా ఎదిగిందన్నారు. పది వేల దుస్తుల పరిశ్రమలతో ‘నిట్‌వేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తిరుపూరు లక్షలమందికి ఉపాధి కల్పిస్తోందని ప్రశంసించారు. నాణ్యతతో కూడిన రెడీమేడ్స్ తయారీకి అవసరమయ్యే లాంగ్ స్టేపుల్(పొడవు పోగుల) కాటన్ తెలంగాణలో సమృద్ధిగా అందుబాటులో ఉందని శ్రీధర్‌బాబు వారికి వివరించారు. తెలంగాణ వ్యవసాయ, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరారు. త్వరలో దీనికి సంబంధించిన సమాచారం అందజేస్తామన్నారు. అందరితో చర్చించిన తర్వాత తెలంగాణ నూతన టెక్స్‌టైల్స్ పాలసీని రూపొందిస్తామని వెల్లడిరచారు. అమెరికా విధించిన 50 శాతం సుంకాల నేపథ్యంలో ఎగుమతులు దెబ్బతిన్నాయని, ఈ సమయంలో వస్త్ర పరిశ్రమ చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించవచ్చని శ్రీధర్‌బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన హీరో ఫ్యాషన్ గ్రూప్ (రామ్‌రాజ్ కాటన్స్) ఛైర్మన్ కె.ఆర్.నాగరాజన్, ఎండీ సుందరమూర్తిలను ప్రత్యేకంగా కలిశారు. సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ (సిమా) సెక్రటరీ జనరల్ కె.సెల్వరాజ్, సంస్థ సభ్యులను తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. తిరుపూరు ఎగుమతిదారుల సంఘం గౌరవ చైóైర్మన్ డాక్టర్ .ఎ.శక్తివేల్, అధ్యక్షుడు కె.ఎం.సుబ్రమణియన్, కార్యవర్గ సభ్యులు తితుకుమరన్, కుమార్ దొరైస్వామి, సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్‌కు చెందిన కె.సెల్వరాజ్, గోపీకుమార్ (చంద్ర గ్రూప్), ప్రతినిధి ఎం. ప్రభుదామోదరన్(ఇండియన్ టెక్స్‌ప్రెన్యూర్స్ ఫెడరేషన్-కోయంబత్తూరు)లతో శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిరుపూరులోని నేతాజీ అప్పెరల్ పార్కును సందర్శించి ఇండస్ట్రీ ప్రతినిధులతో మాట్లాడారు. పర్యటనలో టిజిఐఐసి ఎండీ శశాంక, తెలంగాణ టెక్స్‌టైల్స్, అప్పెరల్ విభాగం డైరెక్టర్ ధరణి కుమార్ కోగంటి తదితరులు పాల్లొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



