– ఏఐ టెక్నాలజీకి హైదరాబాద్ గ్లోబల్ సెంటర్
– డిజైన్ సామాజిక మార్పునకు ఆయుధం కావాలి
– యూఎక్స్ ఇండియా అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: యాప్ డిజైన్ లీడర్‌గా హైదరాబాద్‌ను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. యూఎంవో ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని ఓ హోటల్లో యూఎక్స్ ఇండియా-25 పేరిట గురువారం ఏర్పాటు చేసిన 21వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ప్రోడక్ట్ డిజైన్‌ను ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి లాంఛనంగా ప్రారంబభించారు. హైదరాబాద్ నగరం ఎలాంటి టెక్నాలజీనైనా అందిపుచ్చుకొని లీడర్‌గా ఎదుగుతుందని భట్టి అన్నారు. ఏఐ టెక్నాలజీకి హైదరాబాద్ మహా నగరాన్ని గ్లోబల్ సెంటర్‌గా నిలబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ కేబినెట్ పట్టుదలతో ఉందన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన ప్రతినిధులు హైదరాబాద్ వాతావరణం, సంస్కృతి, కళలు, ఆహారం అన్నిటినీ ఆస్వాదించాలని, ప్రతినిధులు ఈ రాష్ట్రంలో ప్రధానంగా టెక్నాలజీ రంగంలో గుర్తించిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తేవాలని డిప్యూటీ సీఎం కోరారు. డిజైన్ అనేది కేవలం అందానికి కాదు.. అది సామాజిక మార్పునకు ఆయుధం కావాలి అని ఉద్బోధించారు. హైదరాబాదును ప్రపంచ డిజైన్ క్యాపిటల్‌గా మార్చడానికి కలిసి పనిచేద్దామని ప్రతినిధులకు భట్టి పిలుపునిచ్చారు. ఈ సదస్సు హైదరాబాద్ చరిత్రలో ఒక మైలు రాయి అవుతందన్నారు. రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తును పరిపుష్టం చేయడంలో, మరో అడుగు ముందుకు వేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాను భావిస్తున్నానన్నారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు మన జీవితాల్లో అనివార్యమయ్యాయని, కానీ ఒక యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటేనే అది విజయవంతం అవుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ ఇంక్లూజన్‌ను ప్రోత్సహిస్తుందని, టీఎస్-ఐపాస్ వంటి పాలసీల ద్వారా స్టార్టప్‌లకు చేయూతనిస్తుందని తెలిపారు. భారతదేశంలో యూపీఐ వంటి యాప్‌లు సరళంగా రూపొందించడంతో పెద్ద విజయం సాధించాయన్నారు. ప్రాంతీయ భాషల్లోనూ యాప్‌లు రూపొందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం అన్నారు.
త్వరలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ డిజైన్ : మంత్రి శ్రీధర్‌బాబు
లైఫ్ సైన్సెస్ రంగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించాలనే సంకల్పంతో టీ హబ్’ తరహాలోనే బీ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. హైదరాబాద్‌ను కేవలం టెక్నాలజీ హబ్‌గానే కాకుండా గ్లోబల్ డిజైన్ హబ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నదని వివరించారు. త్వరలోనే సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ డిజైన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐ ఇన్నోవేషన్ హబ్‌లో డిజైనింగ్‌కు పెద్దపీట వేస్తున్నామన్నారు. డిజైనింగ్ అంటేనే సృజనాత్మకత అని, కాకపోతే ఆది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. అప్పుడే ఆ యాప్ లేదా వెబ్‌సైట్ మనుగడ సాధ్యమన్నారు. ఈ ప్రక్రియలో ఏఐ వంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ వల్ల ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా చూడాలని, వాటిని ఎదుర్కొనేలా కొత్తగా ఆలోచించాలని శ్రీధర్‌బాబు సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





