ఇది హిందూ వ్యతిరేక పాలనకు నిదర్శనం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: చాంద్రాయణగుట్ట బర్కాస్ ప్రాంతంలో గల ద్విముఖి హనుమాన్ ఆలయంపై దుండగులు దాడి చేసి హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత అమానుషం, హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలు, దేవీదేవతల విగ్రహాలపై వరుసగా జరుగుతున్న దాడులు యాదృచ్ఛికం కావని, సనాతన ధర్మంపై ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో దేవాలయాలపై దాడులు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండటం హిందూ సమాజంపై జరుగుతున్న దాడులకు పరోక్ష మద్దతు ఇచ్చినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నా వరుస దాడులపై స్పందన లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని అన్నారు. హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరచడం, దేవాలయాలను అపవిత్రం చేయడం, విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్రమైన ముప్పుగా మారాయన్నారు. అయినా ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నదని, అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతోందని మండిపడ్డారు. చాంద్రాయణగుట్ట హనుమాన్ ఆలయంపై దాడికి పాల్పడ్డ దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాలకు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించేందుకు బీజేపీ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని రామచందర్‌రావు హెచ్చరించారు.

మహిళా న్యాయవాదిపై దాడి ఆందోళనకరం

రుద్రూర్‌లో మహిళా న్యాయవాదిపై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని రామచందర్ రావు అన్నారు. మహిళా న్యాయవాదిపై దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా భావించాల్సిన తీవ్రమైన ఘటన అని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తి అదుపు తప్పిందని, హిందువులపై దాడులను అడ్డుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమ‌ర్శించారు. ఓ బాలుడిపై జరుగుతున్న దాడిని అడ్డుకుని ప్రశ్నించినందుకే మహిళా న్యాయవాది కల్యాణిని ఎంఐఎం ముష్కరులు అసభ్య పదజాలంతో దూషిస్తూ గుంపుగా దాడికి పాల్పడటం అత్యంత అమానుషమన్నారు. బాధితురాలి ఫిర్యాదులోని అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు అత్యంత సీరియస్‌గా విచారించాలని, నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ, రుద్రూర్ ఘటనలు యాదృచ్ఛికం కాదని, ప్రణాళిక ప్రకారం జరుగుతున్న దాడులేనని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లుతెరిచి మహిళా న్యాయవాదికి పూర్తి భద్రత, న్యాయం కల్పించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత న్యాయవాదికి తమ పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని రామచందర్‌రావు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *