అంతరాంతరము!

మెరుపు తీగెలు

మూడుగంటల ముందు పుట్టిన తమ్ముడ్ని చూడాలని మారాము కాదు, యేకంగా యేడుస్తూ వున్నాడు యేడేళ్ళ వాడి అన్న. వద్దన్నా వినడం లేదు. అమ్మ కడుపులో వున్నప్పుడు చాలా సార్లు ముద్దుపెట్టుకున్నాడు కూడా. తమ్ముడా చెల్లా అని తలుపు బయట రాత్రంతా నిద్రపోకుండా కాచుక్కూర్చున్నాడు. లోపలినుంచి వచ్చిన వాళ్ళని అడిగాడు. ఎవరూ యేమీ చెప్పలేదు. కాని ‘మగబిడ్డే’ అని వారిమాటల్లో విన్నప్పుడు, అందరూ ముఖాలు వేలేసుకు వున్నప్పుడు ‘హే… నాకు తమ్ముడు పుట్టాడోచ్’ అని సంతోషంతో యెగిరి గంతులు వేశాడు. ఎవరో యెందుకో ‘తప్పూ’ అన్నప్పుడు అర్థం కాలేదు.

‘పుట్టగానే పోవాలి, కాని యింకా ప్రాణముంది’ అన్నప్పుడు చిన్నిగుండె పెద్దగానే కొట్టుకుంది. ‘దెయ్యం పిల్ల’ అని అనుకుంటున్నప్పుడు వూపిరి ఆగిపోయినంత పనైంది. దుఃఖంతో కుళ్ళి కుళ్ళి వెక్కిళ్ళు పడుతున్నప్పుడు ‘వీడు పీకమీదకి తెచ్చుకొనేలా వున్నాడు, ఆలమ్మకి తప్ప యెవరికీ లక్ష్యపెట్టేలా లేడు’ అని పురటాలైన తల్లిదగ్గరికి తప్పక పంపించారు.

వీడ్ని చూసి వాళ్ళమ్మ కళ్ళు తుడుచుకుంది. ఊటబావులైన కళ్ళతో నవ్వింది. దగ్గరికొచ్చిన కొడుకు కళ్ళని తల్లి తుడిస్తే, తల్లి కళ్ళని కొడుకు తుడిచాడు. ఇద్దరూ వుగ్గబట్టలేక యేడ్చేశారు, వెక్కి వెక్కి. పిల్లాడ్ని తీసుకువెళ్ళమని అన్నకొద్దీ తల్లి మెడని మరింత గట్టిగా చుట్టేశాడు కొడుకు.

అందరూ దీర్ఘంగా నిట్టూర్చారు. ‘ఏడిస్తే పంపించేయండర్రా’ మాటవిని, కళ్ళని చొక్కా భుజాలతో తుడిచేసి ‘యేడవను’ అన్నట్టు అడ్డంగా తలూపి దూరంగా జరిగాడు పిల్లాడు.

నిశ్శబ్దం ఆవరించింది. కొద్దిసేపు గడిచాక, తలెత్తి దూరంగా గుడ్డల్లోవున్న తమ్ముణ్ణి చూశాడు. తల్లి చూడొద్దు అన్నట్టు అడ్డంగా తలూపుతోంది. దగ్గరిగా వో అడుగు వేసి చూశాడు. ఒక్కక్షణం అలాగే నిలబడిపోయాడు. ఎవరో వెనక్కి లాగితే, తల్లిని చేరాడు.

‘దేవుణ్ణి పట్టుకు దెయ్యం అంటారేం?’ అడిగాడు పిల్లాడు.

అప్పటి వరకూ వుగ్గబట్టిన నిశ్శబ్దం భళ్ళున బద్దలైంది.

తల్లికి అర్థం కాలేదు. ‘దేవుడికీ దెయ్యానికీ తేడా తెలీదా వీళ్ళకి?’ అని తిరిగి తల్లి కళ్ళలోకి చూశాడు. ‘మమ్మీ నువ్వే చెప్పు… మనిషికి వొకతల, మరి దేవుడికి? బ్రహ్మకు మూడు తలలు. తమ్ముడికి రెండు తలలు. చెప్పు… మూడో కన్ను యెవరికి వుంటుంది? శివుడికి వుంటే గొప్ప, తమ్ముడికి వుంటే తప్పా? అదికాదమ్మా… యే దేవుడికైనా మనుషుల్లా రెండే చేతులు వున్నాయా?’ అడుగుతున్నప్పుడు వాడు యేడవడం లేదు. వాడి కళ్ళలోని నిజాయితీ దాగడం లేదు. సూటి చూపూ స్పష్టమైన మాటా… ఆ తల్లికి మాత్రమే అర్థమవుతోంది. పిల్లాడికి అర్థం కావడంలేదని చుట్టూవున్న పెద్దాళ్ళు జాలి చూపులు చూస్తున్నారు.

నవజాత శిశువు చేతులు కదుపుతూ కాళ్ళు సాగదీస్తూ అలానే క్షణాల్లో ఆగిపోయింది. ఎవరో వెళ్ళిచూశారు. ‘వూపిరి’ లేదన్నట్టు తలడ్డంగా వూపారు. పెద్దవాళ్ళ ముఖాలు తేలికపడ్డట్టుగా వున్నాయి. పిల్లాడు కళ్ళలోంచి నీళ్ళు బొట్లుగా రాలుతుంటే ‘దేవుడు చచ్చిపోయాడు’ అని అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు!

-బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *