– సముద్ర గర్భం నుంచి కే-4 క్షిపణి పరీక్ష సక్సెస్
న్యూదిల్లీ, డిసెంబర్ 25 : భారత నౌకాదళం తన అణ్వాయుధ ప్రతిఘటన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. అణు సామర్థ్యం ఉన్న కే-4 బాలిస్టిక్ క్షిపణిని అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాట్ నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం తీరంలోని బంగాళాఖాతంలో ఈ ప్రయోగం జరిగినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి సుమారు 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు.
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ అత్యాధునిక క్షిపణిని స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసింది. గత ఏడాది తొలిసారి ఐఎన్‌ఎస్ అరిఘాట్ నుంచి కే-4ను పరీక్షించగా, తాజాగా రెండోసారి ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్షిపణి మోహరింపుతో శత్రువుల కంటికి చిక్కకుండా సముద్ర గర్భం నుంచే అణ్వాయుధ దాడిని ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు మరింత పెరుగుతుంది. భారతదేశం స్వదేశీయంగా నిర్మించిన రెండో అణుశక్తి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాట్. దీని నుంచి కే-4 క్షిపణిని ప్రయోగించడం ద్వారా, సముద్ర మార్గం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించడంలో భారత్ తన పట్టును నిరూపించుకుంది. ఈ క్షిపణులు ప్రస్తుతం అణుశక్తి జలాంతర్గాములలో మోహరించే దశలో ఉన్నాయి. అధికారికంగా దీనిపై ఇంకా ప్రకటన వెలువడనప్పటికీ రక్షణ రంగ నిపుణులు ఈ విజయాన్ని భారత రక్షణ వ్యవస్థలో కీలక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





