ఫోన్‌ ట్యాపింగ్‌.. మరో కీలక పరిణామం

మాజీ సిఎస్‌ శాంతి కుమారి తదితరుల విచారణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ (పొలిటికల్‌) రఘునందన్‌ రావులను విచారణకు పిలిచి వారి స్టేట్‌మెంట్లను నమోదు చేసింది. ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ 1885, సెక్షన్‌ 5(2) ప్రకారం, ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాలంటే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ అనుమతితోపాటు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ అనుమతీ తప్పనిసరి. ట్యాపింగ్‌ చేయాల్సిన నెంబర్ల జాబితాను రివ్యూ కమిటీ పరిశీలించి అనుమతిని కేంద్రానికి పంపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ప్రభాకర్‌ రావు నేతృత్వంలోని బృందం సుమారు 618 ఫోన్‌ నెంబర్లను ట్యాపింగ్‌ కోసం రివ్యూ కమిటీకి సమర్పించింది. అప్పట్లో సీఎస్‌గా ఉన్న శాంతి కుమారి ఆ లిస్ట్‌ పంపి టెలికం అనుమతులు తీసుకున్నట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. ఇప్పటికే అదే కేసులో అప్పటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌లకు ప్రశ్నలతో కూడిన నోటీసులు జారీ చేయగా, తాజాగా శాంతి కుమారి, రఘునందన్‌ రావులను స్వయంగా విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. కేసు మరింత లోతుగా సాగుతున్న దశలో, ఈ రెండు స్టేట్‌మెంట్లు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డి పోటీలో ఉన్న సమయంలో ట్యాపింగ్‌ జరిగినట్లు సిట్‌ బృందం గుర్తించింది. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ఆయన తమ్ముడు కొండల్‌ రెడ్డి, మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సింగి రెడ్డి హరివర్ధన్‌ రెడ్డి ఫోన్స్‌ ట్యాప్‌ అయినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ నేత బిళ్ళ సుధీర్‌ రెడ్డి, మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌ రెడ్డి వాంగ్మూలం నమోదు చేసింది. గత బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు సహా జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీలోని అనుమానిత ఎమ్మెల్యేలు, వ్యాపార ప్రముఖులపై నిఘా పెట్టారు. స్థానిక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు అందించే ఫోన్‌ నెంబర్స్‌ను మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు ఆధ్వర్యంలోని ఎస్‌ఐబీ టీమ్‌ ట్యాపింగ్‌ చేసేది. సంబంధింత వ్యక్తుల వ్యక్తిగత, కుటుంబ, అనుచరుల వివరాలు, వ్యాపార లావాదేవీలను సేకరించేది. ఇలా ప్రభుత్వ పెద్దలు సూచించిన పొలిటికల్‌ లీడర్ల ఫోన్‌ నెంబర్స్‌తో పాటు వందల సంఖ్యలో ప్రైవేట్‌ వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారు. ఇందులో ప్రణీత్‌రావుతో కలిసి పని చేసిన కానిస్టేబుల్‌ నుంచి అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారి వరకు అక్రమాలకు పాల్పడినట్టు సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది. ట్యాపింగ్‌ ద్వారా రికార్డ్‌ చేసిన ఆడియోలతో పలువురిని బ్లాక్‌మెయిల్‌ చేసినట్టు సిట్‌ ఆధారాలు సేకరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *