– నోయిడా జేవర్లో దేశంలోనే అతిపెద్ద విమనాశ్రాయం
– ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
– పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడకుండా చర్యలు
న్యూదిల్లీ, మార్చి 28: మరో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. జెవర్ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని సరేంద్రమోదీ ప్రారంభించారు. ఈసందర్భంగా మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రాజకీయ నేతలు వదిలేసిన ఈ ప్రాంతమే ఇప్పుడు ప్రపంచస్థాయి నేతలను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంది. నేడు దేశానికి గర్వకారణంగా నిలిచిందని మోదీ పేర్కొన్నారు. విపక్ష సమాజ్వాదీ పార్టీపై విమర్శలు చేశారు. ఆ పార్టీ నేతలు తమ మూఢనమ్మకాలు, పిరికితనంతో నోయిడాను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నవారు నోయిడాలో పర్యటిస్తే అది వారికి అపశకునంగా మారుతుందనే నమ్మకం ఎంతోకాలంగా ప్రచారంలో ఉంది. దానిని ఉద్దేశించే మోదీ మాట్లాడారు. గతంలో ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్నవారు తమ పదవులను కోల్పోతామనే భయంతో ఈ నగరానికి రావడమే మానేశారు. సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓసారి నోయిడాకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఆయన రాకపోగా నన్నుకూడా రావద్దని చెప్పారు. ‘మోదీజీ నోయిడా వెళ్లొద్దు. మీరు ఇటీవలే ప్రధాని అయ్యారు’ అని చెప్పుకొచ్చారు. నేను వెంటనే ఆ ప్రాంత ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తాను.. అది సుదీర్ఘకాలం దేశానికి సేవ చేసే అవకాశాన్ని ఇస్తుంది అని నాడు బదులిచ్చాను. అసలు ఈ నమ్మకానికి 1988 జూన్ లో పునాది పడింది. అప్పుడు వీర్ బహదూర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నోయిడా వెళ్లి వచ్చిన కొన్ని రోజులకే సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మరికొందరు సీఎంలకు అలాంటి పరిస్థితే ఎదురైంది. 1989లో ఎన్డీ తివారీ, 1995లో ములాయంసింగ్ యాదవ్, 1997లో మాయావతి, 1999లో కల్యాణ్ సింగ్ కూడా ఆ నగర పర్యటన తర్వాతే సీఎం కుర్చీకి దూరమయ్యారు. నోయిడాను తప్పించుకోవడానికి నేతలు చిత్రవిచిత్రమైన కారణాలు వెతుక్కునేవారు.. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజ్నాథ్ సింగ్ కూడా నోయిడా భయాన్ని విస్మరించలేకపోయారు. నోయిడా- దిల్లీని అనుసంధానించే డీఎన్డీ రైల్వేను నోయిడా నుంచి కాక ఢిల్లీ వైపు నుంచి ప్రారంభించడం గమనార్హం అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





