– దేవ్‌జీ లక్ష్యంగా కూంబింగ్
– ఐదుగురు మావోయిస్టుల మృతి
రాయపూర్, ఫిబ్రవరి 19: ఛత్తీస్‌గఢ్‌లో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరగగా ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టు అగ్రనేత, పార్టీ కార్యదర్శి దేవ్‌జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కర్రెగుట్టల్లో తలదాచుకున్న మావోయిస్టులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. వెంటనే భద్రతా బలగాలు సైతం ఎదురుకాల్పులకు దిగాయి. ఇరువైపులా హోరాహోరీగా కాల్పులు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. ఆ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు వెల్లడించాయి. మృతుల్లో అగ్రనేతలు ఉండవచ్చని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి కర్రెగుట్టల్లోకి మావోలు ప్రవేశించారంటూ నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. మరోవైపు దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఆ లక్ష్యం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే వందలాదిమంది మావోయిస్టులు మృతిచెందగా వేలాదిమంది వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఎదుట లొంగిపోయారు. పలువురు మావోయిస్టులను ప్రభుత్వం ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 15మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు. ఆ జాబితాలో రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, కీలక నేత ముప్పాళ్ల లక్క్ష్మణరావు అలియాస్ గణపతి, పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, ముప్పిడి సాంబయ్య, వార్త శేఖర్, జోడే రత్నభాయి, బడే చొక్కారావుల కోసం భద్రతా బలగాలు జ్లలెడ పడుతున్నాయి. ఈ రెండేళ్లలో 588మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





