“చాలా రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతు ప్రకటించాయి. చివరగా కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వ చొరవతో గౌరవ సుప్రీం కోర్టు వర్గీకరణను బలపరుస్తూ తీర్పు ఇవ్వడం తో వర్గీకరణ అంశానికి తెరపడింది. ఈ తీర్పు వెలుగులోనే రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు అదే సుప్రీం కోర్టు తీర్పుతో దళితుల మధ్య చిచ్చుపెట్టే మరో అంశం తెరపైకి వచ్చింది. దళితులు క్రైస్తవం స్వీకరిస్తే వారికి కులం రిజర్వేషన్ పొందే అధికారం లేదని కోర్టు తీర్పు నివ్వడం తో తెలుగు రాష్ట్రాల్లో మరో సారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, క్రైస్తవ మతం స్వీకరించిన దళితులను బీసీ వర్గంలో చేర్చాలని ఉన్న విషయాన్ని కొన్ని వర్గాలు ముందుకు తెస్తున్నాయి.”

9059280154
కారంచేడు, చుండూరు అగ్రవర్ణ హత్యాకాండ ఘటనల తర్వాత దేశవ్యాప్తంగా దళిత చైతన్యం ఒక ప్రవాహంలా విస్తరించింది. ఆ చైతన్యాన్ని బలహీనపరచడానికి కొన్ని వర్గాలు మెదటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తమ ఆధిపత్యానికి, ప్రయోజనాలకు దళితుల ఐక్యత ఆటంకం కలుగుతుందనుకునే వర్గాలు సహజంగానే ఆ ప్రయత్నం చేస్తున్నాయి. కారంచేడు, చుండూరు ఘటనలలో మాల, మాదిగలు అన్నదమ్ముల్లుగా కలిసి మెలిసి ఉద్యమించిన ఆ స్ఫూర్తి కి విఘాతం కలిగించే చర్యలకు దాదాపు మూడు దశాబ్దాల నుంచి కొనసాగిస్తూనే ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా జరిగిన దళితుల వర్గీకరణ పోరాట ఫలితం ఇప్పుడిప్పుడే అమలు అవుతున్న తరుణం లో దళిత క్రైస్తవుల అంశాన్ని తెరపైకి వచ్చింది . సామాజిక వివక్ష ను భరించలేక ఆత్మ గౌరవ కోసం క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వర్గాలు
ఎస్సి రిజర్వేషన్ పొందడం పై ఎప్పటినుంచో వ్యతిరేకత ఉంది.
బీసీ సీ రిజర్వేషన్ పొందాల్సిన వారు ఎస్సి రిజర్వేషన్ అనుభవిస్తున్నారని, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం అంటూ ఆరోపిస్తున్నారు. న్యాయంగా దక్కాల్సిన హిందూ దళితుల రిజర్వేషన్ ఫలాలను లాక్కునే అధికారం దళిత క్రైస్తవులకు లేదనే చర్చ సాగుతోంది. ఇది ఇలా ఉంటే అనాదిగా సామాజిక వివక్ష కు గురైన దళిత వర్గాలు సగౌరవంగా వృద్ధిలోకి రావాలని తీసుకొచ్చిన రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా అందడం లేదని ఆర్థికంగా చితికిపోయినా మాదిగ దాని ఉపకులాలకు రిజర్వేషన్ దక్కాలని దానికి అనుగూణంగా వర్గీకరణ జరగాలని మంద కృష్ణ నాయకత్వం లో వర్గీకరణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఆందోళనలు, కమిటీలు న్యాయ పరమైన వివాదాలు వెరసి అనేక మలుపుల మధ్య ఇరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు అమలులోకి తీసుకొచ్చాయి. రిజర్వేషన్లు కేవలం సామాజిక వివక్ష పరమైన అంశమే తప్ప ఆర్థిక వెనకబాటు, జనాభా కు సంబందించిన అంశం ఎంత మాత్రం కాదని, ఆర్థికంగా ఎంత ఎదిగినా కులం మాత్రం పోదని కాబట్టి వర్గీకరణ అనేది ఎస్సిల అనైఖ్యతకు దారి తీస్తుందని కొంతమంది మేధావులు వర్గీకరణను తప్పుపట్టారు.
ఇది కేవలం అన్నదమ్ముల పంచాయతీ గా చూడాలని దళితులలో సామాజిక సమన్యాయం జరగాలంటే వర్గీకరణ అనివార్యమని వర్గీకరణ అనుకూలవాదులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో చాలా రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతు ప్రకటించాయి. చివరగా కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వ చొరవతో గౌరవ సుప్రీం కోర్టు వర్గీకరణను బలపరుస్తూ తీర్పు ఇవ్వడం తో వర్గీకరణ అంశానికి తెరపడింది. ఈ తీర్పు వెలుగులోనే రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు అదే సుప్రీం కోర్టు తీర్పుతో దళితుల మధ్య చిచ్చుపెట్టే మరో అంశం తెరపైకి వచ్చింది. దళితులు క్రైస్తవం స్వీకరిస్తే వారికి కులం రిజర్వేషన్ పొందే అధికారం లేదని కోర్టు తీర్పు నివ్వడం తో తెలుగు రాష్ట్రాల్లో మరో సారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, క్రైస్తవ మతం స్వీకరించిన దళితులను బీసీ వర్గంలో చేర్చాలని ఉన్న విషయాన్ని కొన్ని వర్గాలు ముందుకు తెస్తున్నాయి.
తెలంగాణలో మాదిగ వర్గానికి చెందిన చాలామంది క్రైస్తవ మతాన్ని స్వీకరించగా, ఆంధ్రప్రదేశ్‌లో మాల వర్గంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో వెనుకబడిన మాదిగ ఉపకులాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి, ఎస్సి -బి గ్రూపులో చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో, దళిత క్రైస్తవుల రిజర్వేషన్ అంశం మళ్లీ ముందుకు రావడం, ప్రస్తుతం అమలవుతున్న వర్గీకరణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముంది.
మత మార్పిడితో సామాజిక వివక్ష పూర్తిగా తొలగిపోదనే వాస్తవాన్ని గుర్తించాలి. హిందూ దళితులైనా, క్రైస్తవ దళితులైనా కుల ఆధారిత వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇదే విధంగా, ఆర్థికంగా ఎదిగినా సామాజిక వివక్ష పూర్తిగా తొలగిపోదు. కాబట్టి, కేవలం మతం లేదా ఆర్థిక స్థితిని ఆధారంగా తీసుకుని రిజర్వేషన్లను పునర్వ్యవస్థీకరించడం సరైన పరిష్కారం కాదని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. గతంలో ఏబీసీడీ వర్గీకరణ పేరిట మాల–మాదిగల మధ్య విభేదాలు పెరిగినట్లే, ఇప్పుడు దళిత హిందూ–దళిత క్రైస్తవుల మధ్య విభజన సృష్టించే ప్రమాదం కనిపిస్తోంది. ఇది దళిత సమాజంలోని అన్ని ఉపకులాల మధ్య ఐక్యతను దెబ్బతీసే అవకాశముంది. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితా నుంచి తొలగించి బీసీ వర్గంలో చేర్చాలనే డిమాండ్, మొత్తం రిజర్వేషన్ వ్యవస్థను మళ్లీ పునఃపరిశీలించాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు . దీనివల్ల ఇప్పటికే ఉన్న వర్గీకరణలో మార్పులు రావచ్చు. అటు బీసీ రిజర్వేషన్ అంశం పై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.
అన్య మత మార్పిడులపై ఉద్యమించిన పలు హిందూ సంస్థలకు సుప్రీం కోర్టు తీర్పు ఆయుధంగా మారింది. క్రైస్తవ మత మార్పిడులను తగ్గించాలనుకునే శక్తులు ఇప్పుడు దళిత హిందూ వర్గాలను పావులుగా వాడుకునే అవకాశం లేకపోలేదు. ఇటు దళిత హిందువులు, దళిత క్రైస్తవుల మధ్య విభజనకు దారితీయవచ్చు. రిజర్వేషనా లేదా మతమా అనే సందిగ్ధత సుప్రీం కోర్టు తీర్పు దళిత క్రైస్తవుల ముందు ఉంచింది. ఈ రెండింటిలో ఎటువైపు మొగ్గినా ఆ వర్గాలకు ప్రయోజనమే. గతంలో రిజర్వేషన్ వ్యవస్థనే తీసివేయాలని వాదిస్తూ వచ్చిన కొన్ని ఉన్నత వర్గాలు ఇటీవల ఎకనామిక్ వీకర్ సెక్షన్ (ఈ డబ్లుఎస్ ) వచ్చిన తర్వాత వారి స్వరం మార్చుకొని ఇలాంటి ప్రయత్నాలకు తెగపడుతున్నారు. అది కూడా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వారి వాదనలు ఉండటం తో అటు ఎస్సియేతర వర్గాలనుంచి కూడా మద్దతు కూడగట్టే ప్రయత్నం జరుగుతోంది. మొత్తానికి ఈ అంశం దేశం లో సరికొత్త పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది.





