మరో 490 వెంటిలేటర్లు అందుబాటులోకి తెస్తున్నాం

– 9 ఎంఆర్‌ఐ మిషన్లు కూడా..
– అసెంబ్లీలో మంత్రి దామోదర వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 5: ప్రభుత్వ హాస్పిటళ్లలో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్‌ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ వెల్లడిరచారు. ఈ మేరకు శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ దవాఖాన్లలో వెంటిలేటర్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సుమారు 1790 వెంటిలేటర్‌ బెడ్లు ఉన్నాయని, ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్య సేవలు మెరుగుపడడంతో ప్రభుత్వ హాస్పిటళ్లకు చికిత్స కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య పెరిగిందని చెప్పారు. ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్‌ బెడ్ల అవసరం పెరిగిందని, వాటికనుగుణంగా మరో 490 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం వంటి ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్స్‌, జిల్లా హాస్పిటళ్లలో వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నిమ్స్‌ కెపాసిటీకి మించి పేషెంట్లు వస్తున్నారని, చివరి నిమిషంలో ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటళ్ల నుంచి వెంటిలేటర్‌ మీద నిమ్స్‌కు వచ్చే పేషెంట్ల సంఖ్య కూడా ఎక్కువైందని తెలిపారు. పెరిగిన అవసరాలకనుగుణంగా నిమ్స్‌లో అదనంగా 125 వెంటిలెటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిమ్స్‌లో కొత్తగా సుమారు 850 పోస్టులను భర్తీ చేయబోతున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా, ఆదిలాబాద్‌ రిమ్స్‌, ఎంజీఎంలో మాత్రమే ఎంఆర్‌ఐ యంత్రాలు ఉండగా మరో తొమ్మిది ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎంఆర్‌ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. గతేడాది కొత్తగా 213 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని, దీంతో ఎమర్జన్సీ రెస్పాన్స్‌ 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మరో 79 కొత్త అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నామని, ఇవి అందుబాటులోకి వచ్చాక ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టైమ్‌ 10 నిమిషాలకు తగ్గుతుందని మంత్రి దామోదర తెలిపారు. ఈ రెండేండ్లలో కొత్తగా 16 డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని, గతంలో ఉన్న సెంటర్లలో వందకుపైగా డయాలసిస్‌ మిషన్లను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చామని, రాష్ట్రంలోని ఏ పాయింట్‌ నుంచైనా 20 నిమిషాల ప్రయాణంలోనే డయాలసిస్‌ సెంటర్‌ ఉండేలా, ప్రతి 25 కి.మీ కు ఒక డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు. క్యూర్‌ ఏరియాలో బస్తీ దవాఖాన్లను బలోపేతం చేస్తున్నామని, వాటికి ఇంతకుముందు పీహెచ్‌సీల నుంచి మందుల సరఫరా చేసేది.. ఇకపై సెంట్రల్‌ మెడిసినల్‌ స్టోర్స్‌ నుంచి నేరుగా పంపిణీ చేయబోతున్నాం. ఈ నిర్ణయంతో బస్తీ దవాఖాన్లలో మెడిసిన్‌ ఆర్టిఫిషియల్‌ కొరతకు చెక్‌ పెడుతున్నామని దామోదర తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *