– కేసీఆర్ పాలనలోనే రైతు ఆత్మహత్యలు తగ్గాయి
– జాతీయ నేర గణాంకాలు కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టు
మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: దేశానికే ఆదర్శంగా నిలిచే రైతు సంక్షేమ పథకాలను బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసి సాగును బాగు చేసి రైతు ఆత్మహత్యల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 2014లో 1347 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా 2023 నాటికి 56కి తగ్గాయని, 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14వ స్థానానికి పరిమితమైందని జాతీయ నేర గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. 2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా అందులో తెలంగాణ వాటా 0.51% మాత్రమేనన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో 95.84% తగ్గాయని, ఇవి మాటలు కాదు.. కేసీఆర్ తిరగరాసిన రికార్డులు.. కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్న వాస్తవాలు అని ఆయన అన్నారు. ఇదంతారైతును రాజును చేయాలన్న కేసీఆర్ సంకల్పానికి ఫలితం అని, స్వరాష్ట్రంలో ఒక్కో పథకంతో వ్యవసాయ రంగానికి జీవం పోశారని తెలిపారు. రుణ మాఫీతో రైతన్నకు ధీమా దొరికింది.. రైతు బంధు బంధువు అయ్యింది.. రైతు బీమా కొండంత భరోసా ఇచ్చింది.. 24 గంటల ఉచిత విద్యుత్తు వెలుగులు నింపింది.. పంట కొనుగోళ్లతో ప్రోత్సాహం అందింది.. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి గోస తీరింది.. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరిగింది.. భూగర్భ జలాలు ఉబికి బీడు భూములు పంట పొలాలుగా మారాయి అని వివరించారు. రైతుల బలవన్మరణాలు తగ్గాయంటే అది కేసీఆర్ నాయకత్వ సత్తాకు, రైతు సంక్షేమానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. అందుకే సూర్యచంద్రులు ఉన్నంతకాలం అన్నదాతల ఆత్మబంధువుగా.. కర్షకుడి కన్నీళ్లు తుడిచిన కారణజన్ముడిగా చిరస్థాయిగా నిలిచేది కేసీఆర్ ఒక్కరేనని హరీష్‌రావు స్పష్టం చేశారు. కేసీఆర్ పాలన గురించి నోరు పారేసుకునే వారికి ఇది చెంపపెట్టు సమాధానమన్నారు. ఉమ్మడి పాలనలో నిత్య దుర్భిక్షం, సాగు విధ్వంసం, వలసల దురవస్థ, ఆత్మహత్యల దౌర్భాగ్యమే తప్ప ఏమున్నదని ప్రశ్నించారు. తెలంగాణ కోరుకున్నది, బీఆర్‌ఎస్ సాధించింది ఇదేనని, కేసీఆర్‌కు రైతుకు ఉన్నది పేగు బంధం, ఆత్మ బంధం అయితే కాంగ్రెస్‌కు ఉన్నది కేవలం ఓటు బంధం అని విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





