కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవికి రాష్ట్ర మంత్రి సీతక్క కృతజ్ఞతలు
దిల్లీ, ఆగస్టు 7: ములుగు జిల్లాకు నిర్భయ ఫండ్ కింద రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి ప్రకటించారు. అలాగే పెండిరగ్ నిధులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కేంద్ర మంత్రితో దిల్లీలో గురువారం భేటీ అయ్యారు. రాష్ట్రం మహిళా, శిశు సంక్షేమ రంగాల్లో అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని, అందుకు అదనపు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. మిషన్ వాత్సల్య పథకం కింద 22 వేల మంది అనాథ పిల్లల సంరక్షణ కోసం రూ.105 కోట్లు, పీవీటీజీ ప్రాంతాల్లో 216 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం కోసం రూ.5 కోట్లు, పోషణ అభియాన్ కింద పెండిరగ్‌లో ఉన్న రూ.71 కోట్లతోపాటు, అదనంగా రూ.17 కోట్లు మంజూరు చేయాలని అభ్యర్థించారు. కౌమార బాలికల నైపుణ్యాభివృద్ధి కోసం రూ.220 కోట్లు, అడోలెసెంట్ గర్ల్స్ ప్రోగ్రామ్ కింద రూ.7 కోట్లు విడుదల చేయాలని కూడా కోరారు. గత ఆర్థిక సంవత్సరానికి చెందిన 4వ త్రైమాసిక నిధులు రూ.54 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1వ త్రైమాసికానికి రూ.200 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిధులు అంగన్‌వాడీ సేవల బలోపేతానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ విజ్ఞప్తులపై స్పందించిన కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవికి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత చీరను కేంద్ర మంత్రికి సీతక్క బహుకరించగా ఆమె అభినందించారు.





