– ఈనెల 5న విచారణకు రావాలి
ముంబై, ఆగస్టు 1: బ్యాంకు రుణాల మోసాల కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 5న విచారణకు రావాల్సిందిగా సమన్లు పంపింది. అనిల్ అంబానీకి సంబంధించిన పలు కంపెనీల్లో ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నగదు అక్రమ రవాణా, లోన్ అవకతవకలకు సంబంధించిన కేసులో ఈడీ గతనెల 24న సోదాలు నిర్వహించింది. దిల్లీ, ముంబైల్లో పలుచోట్ల మూడు రోజులపాటు ఈ సోదాలు నిర్వహించగా సుమారు 25 మందిని అధికారులు ప్రశ్నించారు. అంతకుమునుపు సీబీఐ రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసిన నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. అనిల్ అంబానీ గ్రూపు కంపెనీలకు యస్ బ్యాంకు 2017-18లో ఇచ్చిన రూ.3 వేల కోట్ల రుణాల దారి మళ్లింపుపై దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్టు ఈడీ వర్గాలు అప్పట్లో తెలిపాయి. ఈ లోన్‌ల జారీలో బ్యాంకు అధికారులకు లంచాలు ఏమైనా ఇచ్చారా అనే కోణంలో కూడా ఈడీ దృష్టి సారించింది. ఆర్థిక అంశాలు క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా కొన్ని కంపెనీలకు లోన్‌ల మంజూరు, ఫైల్స్‌లో కొన్ని ముఖ్య డాక్యుమెంట్స్ లేకపోవడం, డొల్ల కంపెనీలకు రుణాల మళ్లింపు, లోన్ ఎవర్ గ్రీనింగ్ తదితర విషయాలు ఈడీ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది.





