– అంగన్వాడీలకు గుడ్ల సరఫరాలో కలర్ కోడిరగ్
– మహిళల భద్రతపై త్వరలో సదస్సు
– మహిళా, శిశు సంక్షేమంపై సమీక్షలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరాలో ఆలస్యం, ఇతర లోపాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలు, పప్పు, మంచినూనె, స్నాక్స్, బాలమృతంలలో పాలు మినహా మిగిలినవన్నీ 98 శాతంపైగా సరఫరా అవుతున్నట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. పాలు మాత్రం గత నెలలో 58 శాతం మాత్రమే సరఫరా అయ్యాయని తెలిపారు. పాల సరఫరాలో లోపంపై మంత్రి సీరియస్‌గా స్పందించి పాలు సహా ఆహారం అందజేతలో ఆలస్యం, లోపాలు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ శాఖలో పనుల పురోగతి, అమలవుతున్న పథకాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలకు సరకులు సకాలంలో అందుతున్నాయా లేదా అని మంత్రి ఆరా తీశారు. గుడ్ల సరఫరాపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. గుడ్ల సరఫరాలో కలర్ కోడిరగ్ తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేస్తూ, ప్రతి పది రోజులకోసారి ఏజెన్సీలు గుడ్లు సరఫరా చేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో కాంట్రాక్టులను రద్దు చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం త్వరలో ఉదయం అల్పాహార పథకం ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. 1,261 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి లక్ష్యాన్ని నిర్ణయించగా 1,181 కేంద్రాలకు స్థలాలు గుర్తించామని అధికారులు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి లోపు భవనాల నిర్మాణం పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు బల్లలు, సిబ్బంది, చిన్నారుల యూనిఫాంలు తక్షణం సరఫరా చేయాలని ఆదేశించారు. మహిళల భద్రత అంశంపై కూడా మంత్రి దృష్టి సారించారు. మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగినులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్చంద సంస్థలతో ఈ నెల 19, 20 తేదీల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి అనితారామచంద్రన్, డైరెక్టర్ సృజన, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





