అంగన్వాడి కేంద్రాలను రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: కొంతమంది సిబ్బంది తీరు వల్ల కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. జిల్లా అధికారులు అంగన్వాడి కేంద్రాలను విధిగా సందర్శించాలని, అంగన్వాడీల్లో హాజరు శాతాన్ని పెంచాలని, నవంబర్‌ 19లోపు నిర్దేశించుకున్న లక్ష్యానికనుగుణంగా అంగన్వాడి కేంద్రాల భవనాల నిర్మాణాన్ని పూర్తిచేయాలని సూచించారు. దేశంలో అంగన్వాడి సేవలను ప్రవేశపెట్టిన ఇందిరా గాంధీ జయంతి నవంబర్‌ 19 అని, అదే రోజు వేయి నూతన అంగన్వాడీ భవనాలను ప్రారంభించుకునే విధంగా నిర్మాణాలను పూర్తి చేయాలని, నిధులు సరిపోకపోతే అదనపు నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వర్షాకాలం కాబట్టి సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని,
పాత అంగన్వాడి భవనాలలో పెచ్చులు ఊడే ప్రమాదం ఉందంటూ అలాంటి భవనాలను గుర్తించి తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేనిచోట ప్రైవేట్‌ భవనాల్లోకి మార్చాలన్నారు. రాత్రివేళల్లో విష పురుగులు అంగన్వాడీ కేంద్రాల్లోకి వచ్చే ప్రమాదముందని, మన ఇంటిని ఏ రకంగా శుభ్రపరచుకుంటామో అదే రకంగా అంగన్వాడి కేంద్రాలు శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫీడిరగ్‌, టీచింగ్‌, అటెండెన్స్‌పై యంత్రాంగమంతా దృష్టిసారించాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *