– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంతాపం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10: రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందె శ్రీ ఆకస్మిక మృతి పట్ల ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావానికి ఆత్మ అయిన ఆయన రచనలు ప్రతి తెలంగాణావాది రక్తంలో ఆవేశాన్ని, ఆత్మగౌరవాన్ని నింపాయని పేర్కొన్నారు. ప్రజల మనసునుండి ఉద్భవించిన సాహితీ ధారలు అందెశ్రీ గీతాలు, రచనలు అంటూ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అవి కీలక భూమిక పోషించాయన్నారు. ప్రజల జీవన గాథలకు శాశ్వత స్వరాలనిచ్చాయని, వారి కలం సామాజిక న్యాయం, సమానత్వం, స్వాభిమానం కోసం తుపాకీలా పనిచేసిందని పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో అందెశ్రీ కృషి అపూర్వం.. తన కవిత్వం ద్వారా దళితులు, అట్టడుగు వర్గాల కష్టాలపై గళమెత్తి ప్రపంచానికి వినిపించిన మహానుభావుడని ఆయన కొనియాడారు. అందెశ్రీ వాంటి ప్రజాకవిని కోల్పోవడం తెలంగాణ సాహిత్య ప్రపంచానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కలం ఆగిపోయినా ఆయన ఆలోచనలు తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెలో ఎప్పుడూ పదిలంగానే ఉంటాయన్నారు. దళిత ఆత్మగౌరవ ఉద్యమాలకు అందెశ్రీ రచనలు శాశ్వత ప్రేరణగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన పార్థివ దేహం పై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అందె శ్రీ సతీమణి, కుమారుడిని ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేసిన టెంటు ఇతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సీఎంఓ సెక్రటరీ శ్రీనివాసరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ ముకుంద రెడ్డి, డీసీపీ బాలస్వామి, జీహెచ్ ఎంసీ అధికారులతో, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డితో కలిసి ఏర్పాట్ల విషయంపై చర్చించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





