తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది

– అందెశ్రీ మరణం సాహితీలోకానికి తీరని లోటు
– జయజయహే..ను రాష్ట్ర గీతంగా మార్చుకున్నాం
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
– మంత్రుల సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: మాయమై పోతున్నాడమ్మ మనిషన్నవాడు.. అఅనే పాట‌తో  ప్రఖ్యాతిగాంచిన కవి అందెశ్రీ ఇపుడు మనల్ని వీడి మాయమయ్యారు. మన కళ్లెదుట లేకున్నా మన గుండెల్లో మాత్రం చిరస్థాయిగా మిగిలారు. ఆయన అకాల మృతికి పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కేబినెట్‌ సహచరులు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను ర‌చించిన‌ అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో ఆ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని గుర్తు చేశారు. అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. అందెశ్రీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్‌ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. అందెశ్రీ భౌతిక కాయాన్ని గాంధీ హాస్పిట‌ల్ నుంచి లాలాపేట్‌లోని ఆయ‌న స్వ‌గృహానికి త‌ర‌లించారు. అనంత‌రం స్థానిక జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం ఉంచారు.

సాహితీ వనంలో మహావటవృక్షం కూలింది : ఉప ముఖ్యమంత్రి

రాష్ట్ర గీతమైన జయజయహే తెలంగాణ రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. మలిదశ ఉద్యమంలో ఆయన రచించిన జయజయహే తెలంగాణ గీతం జాతి గొంతుకై అందరినీ ఒక్కతాటి మీదకు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర సాధనకు ఆయన చేసిన సాహితీ కృషి చరిత్ర ఉన్నంత వరకూ నిలిచిపోతుందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన రోజున ఆయన ఎంతో ఉద్విగ్నతకు లోనైనయ్యారంటూ అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఆయనతో కలిసి పంచుకున్న దార్శనిక ఆలోచనల్లో అట్టడుగువర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలన్న తపపను ఉప ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాహితీవనంలో మహా వటవృక్షం నేలకూలిట్లుగా ఉందని ఉప ముఖ్యమంత్రి తన సంతాపాన్ని ప్రకటించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఉద్యమంలో ఆయన రచనలు కీలక పాత్ర: మంత్రి పొంగులేటి 

అందెశ్రీ అకాల మరణం పట్ల రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావంలో ఆయన రచనలు, గానం కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

తెలంగాణ సమాజానికి పూడ్చలేని లోటు: మంత్రి శ్రీధర్‌బాబు
అందెశ్రీ హఠాన్మరణం పట్ల ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజానికి, సాహితీ లోకానికిీ పూడ్చలేని లోటు అని పేర్కొన్నారు. మలిదశ ఉద్యమ కెరటమై, రాష్ట్ర సాధన ఆకాంక్షను కోట్లాది ప్రజల గుండెల్లో బలంగా నిలిపిన చారిత్రక గీతాన్ని అందించిన మహనీయుడు అందెశ్రీ అని కొనియాడారు. ఆయన కలం నుండి జాలువారిన ప్రతి పదం, తెలంగాణ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యమన్నారు. ఆయన సాహితీ సంపద, ముఖ్యంగా జయ జయహే తెలంగాణ గీతం ఉన్నంతవరకు అందెశ్రీ మన గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోతారన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

స్వరాష్ట్ర ఉద్య‌మంలో ఆయన చేసిన సేవలు అపూర్వం: మంత్రి సీతక్క

అందెశ్రీ మృతిపట్ల మంత్రి సీతక్క తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజా సాహిత్యానికి, స్వరాష్ట్ర ఉద్య‌మంలో అందెశ్రీ అందించిన స్ఫూర్తి, సేవలు అపూర్వమని పేర్కొన్నారు. ఆయన అకాల మరణం సాహిత్య లోకానికే కాకుండా మొత్తం తెలంగాణ సమాజానికి తీరని లోటని అన్నారు. ఆయన రచనలు, గీతాలు ప్రజల్లో చైతన్యం నింపడమేగాక ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయని గుర్తుచేశారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా ఆలపిస్తోందని అన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు మంత్రి సీతక్క ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని, ఆయన తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. ఆయన ఉద్యమ లక్షణాలు, పోరాట పటిమ, రచనలు, ఆయన పాటలు ప్రస్తుత సమాజానిక,ి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ చరిత్ర, ఉనికి, ఉద్యమ చరిత్రపై, సాహిత్యంపై ఆయన రాసిన పాటలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఆయన రాసిన జయ జయహే తెలంగాణ పాటను కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రీయ గీతంగా అధికారికంగా ప్రకటించి గౌరవించిందని గుర్తు చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *