– మా నేతలను జైలులో పెడితే భయపడబోం
– నీకూ అదే గతి పట్టక తప్పదు రేవంత్..
– కేటీఆర్ హెచ్చరిక
- జైలులో బాల్క సుమన్‌కు పరామర్శ
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. జైలులో పెడితే మా నాయకులు భయపడతారని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని, ఇలాంటి ఉడుత ఊపులకు తాము భయపడబోమని చెప్పారు. సుమన్ ఇవాళ కొత్తగా జైలుకు పోలేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆరు నెలలు జైల్లో ఉన్నాడని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో అక్రమంగా అధికారాన్ని హస్తగతం చేసుకుందని కేటీఆర్ ఆరోపించారు. ఆదేమని ప్రశ్నించిన బీఆర్‌ఎస్ నాయకులపై కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించిందని విమర్శించారు. క్యాతన్‌పల్లిలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలో జరిగిన అక్రమాన్ని ప్రశ్నించినందుకు సుమన్‌ను జైల్లో పెట్టారని మండిపడ్డారు. ’రేవంత్ రెడ్డీ గుర్తుపెట్టుకో.. నువ్వు మళ్లీ చిప్పకూడు తినే సమయం కచ్చితంగా వస్తుంది’ అని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. ’
మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 22 చోట్లకుగానూ 14 స్థానాల్లో గెలుపుతో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లో మాత్రమే గెలిచినా అధికార దాహంతో ప్రజాతీర్పును అపహాస్యం చేసింది. సీఎం, స్థానిక మంత్రి సూచనలకు అనుగుణంగా అధికారులు వారికి తొత్తులుగా మారి ప్రజాతీర్పును ఎగతాళి చేశారు’ అని మండిపడ్డారు. మరికొన్ని మున్సిపాలిటీలలోనూ ఇదే రీతిన వ్యవహరించారు. మహిళా కౌన్సిలర్లపై అసభ్యంగా ప్రవర్తించినా కనీసం మంత్రి స్పందించలేదు. దేశ చరిత్రలో ఇంత ఘోరమైన రాజకీయం లేదు. సుమన్‌ను ఇక్కడ జైలులో ఉంచి వారి డ్యూటీకి ఆటంకం కలిగించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులను బూతులు తిట్టినా, బీజేపీ ఎంపీ అరవింద్ పోలీసులను తిట్టినా కేసులు పెట్టలేదు. మూడు కోట్ల ఆఫర్ ఇచ్చినా మా కౌన్సిలర్లు లొంగలేదు. సీపీఐ కౌన్సిలర్లు సైతం నిబద్ధతతో ఉన్నారు. పొత్తుధర్మాన్ని పాటిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. పోలీసులను బూతులు తిడితే కేసులు పెట్టని డీజీపీ బీఆర్‌ఎస్ నేతలపై మాత్రం కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. తిరిగి రాష్ట్రంలో గులాబి జెండా ఎగురుతుంది. ఏ కలుగులో దాక్కున్నా వారిని వదిలే ప్రసక్తే లేదు. రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలో తొక్కుతున్న వారిని వదలం. క్యాతన్ పల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్‌లో వెంటనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాన్నారు. నిజాయతీగా ఎన్నిక జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. అధికారుల ముసుగులో అధికార పార్టీకి వత్తాసు పలికే వారిని వదలం. క్యాతన్‌పల్లిలో మహిళా కౌన్సిలర్లపై అసభ్యంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై సైతం కేసు పెట్టారు. అధికార పార్టీకి ప్రజలు బుద్ధిచెప్పే రోజు వస్తుంది. సుమన్‌ను దగ్గరలో ఉన్న జైలులో పెట్టకుండా దూరంగా ఉన్న జైలులో పెట్టి దోమలు ఎక్కువగా ఉన్న గదిలో ఉంచి వేధిస్తున్నారు. వీటన్నింటిని గుర్తుపెట్టుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





