నకిలీ విత్తనాలు, ఎరువులపై  ఉక్కు పాదం

  • బాధ్యుల‌పై  పీడీ యాక్ట్ నమోదు చేయాలి
  • ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం అమ‌లులో నిర్ల‌క్ష్యం ప‌నికిరాదు..
  • రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నకిలీ విత్తనాలు, ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని, ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులను ఉక్కు పాదంతో అరికట్టాలన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి  కొండా సురేఖ, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ అంజి రెడ్డి,ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినీ రెడ్డి, కెఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, తదితరులతో కలిసి ధాన్యం కొనుగోళ్లు, సేకరణ, వ్యవసాయం, వర్షాకాలం ముందస్తు ప్రణాళికా, ఇద్దరమ్మ ఇండ్లు, భూ భారతి, వరంగల్ ఎయిర్ పోర్టు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..  ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మి నట్లయితే ఉపేక్షించేది లేదు.

 పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు.   నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిలో ఎంతటి వారైనా ఉన్నా సరే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో మొదటి స్థానంలో రాష్ట్రం నిలిచింద‌ని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాల‌ని,  ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారులకు ఏజ్ లిమిట్ లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్ష్యం పట్ల కలెక్టర్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. జిల్లా కలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇకపై ఇలాంటి నిర్లక్ష్యం ఉంటే కుదరదు ఇప్పటివరకు కనీసం 50 శాతం కూడా లిస్ట్ ప్రకటించక పోవడం బాధాకరమ‌ని అన్నారు. బెనిఫిషరీ లిస్ట్ ప్రేమ్ కట్టుకోవడానికి కాదు.. కలెక్టర్లు ఎందుకు జాప్యం చేస్తున్నారు.  ఒక్కో కలెక్టర్ పరిధిలో ముగ్గురికి మించి ఎమ్మెల్యేలు లేరు..ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతున్నారు..  ఇందిరమ్మ ఇళ్ల పోస్టింగ్స్ లబ్ధిదారులకు ఇవ్వకుండా మీ దగ్గర పెట్టుకోవడం  కలెక్టర్లకు సరికాదు అని వ్యాఖ్యానించారు. జూన్ 06 లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాల‌ని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో  వయో పరిమితి లేదని, జూన్ 6 కటాఫ్ డేట్ గా ఇందిరమ్మ ఇళ్ల పథకం అప్లికేషన్ల క్లియర్ చేయాల‌ని మంత్రి  పొంగులేటి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *