నెత్తురు మండే, శక్తులు నిండే యువతకు ఆహ్వానం!

“తెలుగులో విద్యాబోధన ఎంతగా తగ్గిపోతున్నా, చదివేవాళ్లు తగ్గిపోతున్నారని ఫిర్యాదులు ఎంతగా ఉన్నా తెలుగు సాహిత్యంలో అంతకంతకూ ఎక్కువగా రచయితల సంఖ్య పెరుగుతున్నది. సాహిత్య ప్రయోగాల విస్తృతి పెరుగుతున్నది. కొత్త రచయితలతో, కొత్త పుస్తకాలతో, కొత్త అభివ్యక్తితో, కొత్త కథన పద్ధతులతో యువత సృజన రంగంలో అద్భుతమైన కృషి చేస్తున్నది. యువ సాహిత్యకారుల బృందాలు ఏర్పడుతున్నాయి. ఈ తరం వాతావరణానికి తగినట్టుగానే సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరిగింది. ఇది వర్తమాన తరం మాత్రమే కాదు, కనీసం మరొక మూడు నాలుగు దశాబ్దాల భవిష్యత్తు ఉన్న తరం కూడా. అందువల్ల ఈ తరం ఆలోచనలను, అభివ్యక్తిని, ప్రయత్నాన్ని, సృజనను అర్థం చేసుకోవలసి ఉంది, శ్రద్ధగా గమనించవలసి ఉంది. దాన్ని నిర్ద్వంద్వంగా సాదరంగా ఆహ్వానించవలసి ఉంది.”

ఈ వారాంతం హైదరాబాద్ ఒక ఉత్తేజరక అనుభవాణ్ని పొందబోతున్నది. సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం నిర్వహణలో యువ సాహిత్య ఉత్సవం జరుగుతున్నది. సాహిత్య సంఘాల సభలు, సమావేశాలు, సాహిత్యకారుల కలయికలు, పుస్తకాల సంభాషణలు హైదరాబాద్ కు, తెలంగాణకు కొత్తకాదు. కొద్ది రోజుల కిందనే దిగ్విజయంగా, ఉత్తేజకరంగా జరిగిన ఛాయ లిటరరీ ఫెస్టివల్ మిగిల్చిన ఉజ్వల జ్ఞాపకాలు ఇంకా చాలా మందికి మనసు మీదనే ఉన్నాయి. మామూలుగానే ఎటువంటి మనుషుల కలయిక, సృజనకారుల సంభాషణ అయినా ఆహ్వానిచదగినదే గాని, ఇప్పుడు జరగబోయే సాహిత్యోత్సవం మరింత విశిష్టమైనది. ఇది ‘గోడల్ని ఛేదించే అక్షరాలు–సమూహ యువజన సాహిత్యోత్సవం’గా సమాజంముందుకు వస్తున్నది. ఒక కీలకమైన సమయంలో, ఒక అనివార్యమైన సామాజిక సందర్భాన్ని సృష్టిస్తున్నది, విస్తరిస్తున్నది, వికసిస్తున్నది.

తెలుగులో విద్యాబోధన ఎంతగా తగ్గిపోతున్నా, చదివేవాళ్లు తగ్గిపోతున్నారని ఫిర్యాదులు ఎంతగా ఉన్నా తెలుగు సాహిత్యంలో అంతకంతకూ ఎక్కువగా రచయితల సంఖ్య పెరుగుతున్నది. సాహిత్య ప్రయోగాల విస్తృతి పెరుగుతున్నది. కొత్త రచయితలతో, కొత్త పుస్తకాలతో, కొత్త అభివ్యక్తితో, కొత్త కథన పద్ధతులతో యువత సృజన రంగంలో అద్భుతమైన కృషి చేస్తున్నది. యువ సాహిత్యకారుల బృందాలు ఏర్పడుతున్నాయి. ఈ తరం వాతావరణానికి తగినట్టుగానే సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరిగింది. ఇది వర్తమాన తరం మాత్రమే కాదు, కనీసం మరొక మూడు నాలుగు దశాబ్దాల భవిష్యత్తు ఉన్న తరం కూడా. అందువల్ల ఈ తరం ఆలోచనలను,  అభివ్యక్తిని, ప్రయత్నాన్ని, సృజనను అర్థం చేసుకోవలసి ఉంది, శ్రద్ధగా గమనించవలసి ఉంది. దాన్ని నిర్ద్వంద్వంగా సాదరంగా ఆహ్వానించవలసి ఉంది.

అటువంటి యువతరం సాహిత్యకారులు ఒక రోజంతా ఒక చోట కలిసి సంభాషించుకోవడం, సమాలోచనలు జరుపుకోవడం, ఒకరు రాసినది మరొకరు వినడం, ఒకరు రాసినదాన్ని మరొకరు విమర్శించడం, విశ్లేషించడం, మొత్తంగా ఈ యువతరం గతం నుంచి ఏమి నేర్చుకోవలసి ఉందో, భవిష్యత్తుకు ఏమి మిగల్చవలసి ఉందో గుర్తించడం ఇవాళ్టి అవసరం.

ఈ సమావేశ స్థలం యాదృచ్చికమే కావచ్చు గాని ఒక అద్భుతమైన పాఠశాల. ఈ స్థలం సృజనకారులకు సానుకూల పాఠాలూ నేర్పుతుంది, ప్రతికూల పాఠాలూ నేర్పుతుంది. ఈ మహాభవనం ఒక దేశీయ స్థలం మీద ఒక పరాయి పాలనకూ, ఆధిపత్యానికీ, దౌర్జన్యానికీ చిహ్నం. ఈ మహాభవనమే రెండు సంస్కృతుల మధ్య ఆదాన ప్రదానాలకు చిహ్నం. ప్రేమకు చర్మపు రంగుల, మతాల, ఆభిజాత్యాల, భేషజాల అడ్డుగోడలు లేవని నిరూపించిన స్థలం. ఈ స్థలమే పరాయి పాలన మీద అద్భుతమైన ఐక్య ప్రజా ధిక్కారాన్ని ప్రదర్శించిన మహత్తర రంగస్థలం. ఈ స్థలమే ఇప్పుడు పెట్టుకున్న పేరు వల్ల శ్రమజీవన సంస్కృతి చిహ్నం. శ్రమ ఫలితం శ్రామికులకే దక్కాలనే సహమైన, నైసర్గికమైన సామాజిక న్యాయ భావనకు చిహ్నం.

మొట్టమొదట ఈ సాహిత్యోత్సవం జరుగుతున్న ప్రాంగణం మతాల సరిహద్దులు లేని ప్రేమైక జీవనానికి సూచిక. హైదరాబాద్ రాజ్యంలో బ్రిటిష్ రెసిడెన్సీగా 1800లో నిర్మించినదీ ప్రాంగణం. స్వతంత్ర హైదరాబాద్ రాజ్యంలో రాజధాని నడిబొడ్డున జీవనది మూసీ తీరాన మరొక దేశపు అధికారికి రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల కింద ఇంత భవనం అవసరం ఏమి వచ్చింది? తమ సరుకులు అమ్ముకోవడానికీ, ఇక్కడి ముడిసరుకులు కొనుక్కుపోవడానికీ, అంటే మౌలికంగా వర్తకానికి వచ్చిన బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ, వర్తకంలో కన్నా ఎక్కువ లాభాలు, ఎక్కువ ప్రయోజనాలు, అసలు వర్తకం లాంటి అనేకానేక జీవనవ్యాపారాల మీద ఆధిపత్యం పాలనలో ఉంటాయని గుర్తించింది.

“ఇవాళ సమాజంలో సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించే శక్తులది పైచేయి అవుతున్నది. సమాజాన్ని కార్పొరేటీ కరించడానికి,  కుల, మత దురహంకారాన్ని నింపడానికి, సైనికీకరించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. చారిత్రకంగా ఉన్న గోడలు ఉండగా, వాటిని బలోపేతం చేసే పనీ, కొత్త గోడలు నిర్మించే పనీ ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పాత గోడలనూ కొత్త గోడలనూ కూల్చవలసిన బాధ్యత, గోడలు లేని సువిశాల ఆహ్లాద ప్రపంచాన్ని నిర్మించి వినీలాకాశం కప్పు కింద ఒక సురుచిర శాంత సమాజాన్ని నిర్మించవలసిన బాధ్యత భవిష్యత్ తరం మీద ఉన్నది.”

స్థానిక ప్రభువుల మధ్య పోటీలను, వైరాలను, యుద్ధాలను ఉపయోగించుకుని దేశంలో కొన్ని రాజ్యాలలో పాలన నెలకొల్పింది. కలకత్తా రాజధానిగా పాలన ప్రారంభించింది. అప్పటికీ లొంగని రాజ్యాలతో అనేక ఆర్థిక, రాజకీయ ఒడంబడికలు కుదుర్చుకుని, తన రాజకీయాలు నడపడానికి రెసిడెన్సీలు ప్రారంభించింది. అలా 1788లో హైదరాబాద్ లో బ్రిటిష్ రెసిడెన్సీ ప్రారంభం కాగా, 1797లో మూడో రెసిడెంట్ గా వచ్చిన జేమ్స్ ఎకిలస్ కిర్క్ పాట్రిక్ ఈ భవనం నిర్మించాడు. అలా పరాయి పాలనకు, ఒక భారీ అడ్డుగోడకు ఇది ఒక సూచిక.

జేమ్స్ కిర్క్ పాట్రిక్ ఇస్లామిక్ సంస్కృతితో ఎంతగా ప్రభావితుడయ్యాడంటే ఇంట్లో మొఘల్ తరహా దుస్తులు ధరించేవాడని, హుక్కా పీలుస్తుండేవాడని, పాన్ వేసుకునేవాడని, తమిళనాడులో పుట్టినందువల్ల తమిళంతో పాటు ఉర్దూ, పర్షియన్, హిందూస్తానీ ధారాళంగా మాట్లాడేవాడని సమకాలీన చరిత్రకారులు రాశారు. నాటి హైదారాబాద్ ప్రధాన మంత్రి నవాబ్ మహమూద్ అలీ ఖాన్ మనవరాలు ఖైరున్నిసాతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు, ఆ మతాంతర వివాహానికి సామాజిక, అధికారిక ఆమోదం లేకపోయినా ఆమెనే తన సహచరిగా బహిరంగంగా చెప్పుకున్నాడు, పుట్టిన ఇద్దరు పిల్లలకు ఇస్లామిక్ పేర్లు పెట్టాడు. అలా కొన్ని గోడలను ఛేదించిన అనుభవాలకు ఈ ప్రాంగణం ఒక చిహ్నం.

నిజానికి ఈ రెసిడెన్సీ క్రైస్తవ-ముస్లిం సమాగమానికి సూచిక అయితే, అసలు హైదరాబాద్ నగరమే ముస్లిం – హిందూ ప్రేమ వారధి మీద నిర్మాణమయింది. ముస్లిం యువకుడికీ, హిందూ యువతికీ మధ్య, యువరాజుకూ సాధారణ నర్తకికీ మధ్య, రాజధానికీ శివారు గ్రామానికీ మధ్య, మూసీ అవతలి ఒడ్డుకూ ఇవతలి ఒడ్డుకూ మధ్య వారధి నిర్మించిన ప్రేమైక జీవన చిహ్నం మన నగరం. ఇవాళ ముళ్లపొదల్లా విస్తరిస్తున్న లవ్ జిహాద్ ఆరోపణల గోడలకు ఆనాటి సామరస్యపు ప్రేమానురాగాల జవాబు హైదరాబాద్. అలా గోడలను ఛేదించిన ఈ నగరంలో, ఈ ప్రాంగణంలో ఇప్పుడు గోడల్ని ఛేదించే అక్షరాల సమూహ యువజన సాహిత్యోత్సవం జరగడం సముచితం.

అవన్నీ సామాజిక అంతరాల గోడలను వ్యక్తిగత స్థాయిలో ఛేదించిన ఉదాహరణలు. కాని ఇదే ప్రాంగణం సామాజిక రాకీయార్థిక అంతరాల గోడలను సామాజికంగా ఛేదించిన ఉజ్వల ఉదాహరణలకు కూడా చిహ్నం. ఈస్టిండియా కంపెనీ పాలన దుర్మార్గాలను ఎదిరించి, బ్రిటిష్ వారిని దేశం నుంచి వెళ్లగొట్టడానికి జరిగిన తొట్టతొలి ప్రయత్నం 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం. బ్రిటిష్ పాలిత భారతదేశంలో,  ఉత్తరాదిలో అది అనేక చోట్ల జరిగింది. దక్షిణాది బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో ఆ తిరుగుబాటు ప్రభావం తక్కువ. కాని బ్రిటిష్ పాలిత ప్రాంతం కాకపోయినా హైదరాబాద్ లేచి నిలిచింది. ఏకైక బ్రిటిష్ పాలనా చిహ్నంగా ఉండిన ఈ రెసిడెన్సీ మీద హైదరాబాద్ దాడి చేసింది. ఒకవైపు బ్రిటిష్ అనుకూల రాజు ఇతర ప్రాంతాల తిరుగుబాటుదారులను అణచడానికి తన సైనికులను బ్రిటిష్ సైన్యాలకు సహాయంగా పంపగా, తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ ల నేతృత్వంలో వందలాది మంది రెసిడెన్సీ మీద అనూహ్యమైన దాడి చేశారు.

పరాయి పాలనకు వ్యతిరేకంగా నూట డెబ్బై సంవత్సరాల కిందనే హైదరాబాద్ చేసిన ఆగ్రహ ప్రకటన అది. తుర్రెబాజ్ ఖాన్ ను ఉరి తీసి చంపేశారు. మౌల్వీ అల్లావుద్దీన్ ను అండమాన్ లో ద్వీపాంతరవాస శిక్ష విధించి చంపేశారు. కాని మా దేశం మాదే, మరొకరి పాలనను,  ఆధిపత్యాన్ని సహించబోం అన్న మాట మరణించలేదు. ఇవాళ చప్పన్నారు దేశాల వ్యాపారమూ దుర్మార్గమూ దౌష్ట్యమూ పాలకుల జీహుజూర్ జోహుకుం కింద యథావిధిగా సాగిపోతున్నప్పుడు, ఆ గోడలు పెరిగిపోతున్నప్పుడు తప్పకుండా గుర్తు చేసుకోవలసిన చరిత్ర ఇది.

సామాజిక అంతరాల గోడలను ఛేదించిన మరొక ఉత్తేజకరమైన అనుభవానికి చెందిన వీరనారి చాకలి (చిట్యాల)  ఐలమ్మ పేరు ఈ ప్రాంగణానికి ఇటీవలనే చేరింది. ఆమె పేరు మీద వెలుగొందుతున్న ఈ ప్రాంగణంలో సమావేశం అవుతున్న యువ సృజనకారులు ఆమె ఎన్ని గోడల్ని, ఏయే గోడలను ఛేదించిందో తెలుసుకోవాలి. ఆమె దొరతనం సృష్టించిన గోడలను పగులగొట్టింది. శ్రమ ఫలితం శ్రామికులకు దక్కనివ్వని గోడలను పగులగొట్టింది. సబ్బండవర్ణాలు ఏకమై తన పోరాటానికి సంఘీభావం ప్రదర్శించినప్పుడు ఆమె కులం గోడలను కూడా ఛేదించింది. తన నెత్తురు చెమటై పండించిన పంటను కోసి తన ఇంటికి చేర్చినందుకు సంఘ సభ్యులు కుట్రకేసులకు గురై రాజ్యం లేపే అడ్డుగోడలను కూడా చూపారు. ఈ నేల మీద భూమి భుక్తి విముక్తి కోసం ఒక మహత్తరమైన రైతాంగ సాయుధ పోరాటానికి ప్రేరణగా నిలిచి, గోడలు లేని ప్రపంచ స్వప్నానికి ఆమె ఒక చిహ్నంగా మారింది.

ఈ చారిత్రక ఉజ్వల గాథలను ఈ తరం సృజనకారులకు పరిచయం చేయడం ఎందుకంటే, ఎప్పుడైనా వర్తమాన తరం గతానికీ భవిష్యత్తుకూ వారధి. వర్తమానం, ప్రస్తుతం చాలా చాలా ముఖ్యమైనవే, శక్తిమంతమైనవే, ఉత్తేజకరమైనవే గాని, అవి అటు గతం నుంచి కొనసాగి వచ్చినవి, ఇటు భవిష్యత్తులోకి ప్రవహించవలసినవి. అందువల్ల వర్తమాన యువతరం అత్యద్భుతమైనదే అయినా అది గతం పోగుచేసిన సంచిత సంపద నుంచి తీసుకోకుండా మనజాలదు. ఉదాహరణకు ఈ తరం వాడుతున్న భాష, ఈ తరం వాడుతున్న భావాలలో అత్యధికం, ఈ తరం వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో, పరికరాలలో అత్యధికం గతం నుంచి ప్రవహించి వచ్చినవే. అలా గతం నుంచి సాగి వచ్చినదాన్ని తీసుకోవడానికి వర్తమాన తరానికి పూర్తి హక్కు ఉంది. అదే సమయంలో భవిష్యత్ తరానికి ఇవ్వవలసిన బాధ్యత కూడా ఉంది. అలా ప్రతి వర్తమాన తరమూ ఒక వారధి పాత్రను నిర్వహించవలసిందే. ఈ వారధి పాత్ర భాషలో, సాహిత్యంలో, కళలో, సంస్కృతిలో మరింత ఎక్కువని గుర్తించవలసి ఉంది.

గత చరిత్రను ఇవాళ్టి యువతరం సాహిత్యకారులకు గుర్తు చేయడానికి మరొక కారణం కూడా ఉంది. ఇవాళ సమాజంలో సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించే శక్తులది పైచేయి అవుతున్నది. సమాజాన్ని కార్పొరేటీకరించడానికి, కుల, మత దురహంకారాన్ని నింపడానికి, సైనికీకరించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. చారిత్రకంగా ఉన్న గోడలు ఉండగా, వాటిని బలోపేతం చేసే పనీ, కొత్త గోడలు నిర్మించే పనీ ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పాత గోడలనూ కొత్త గోడలనూ కూల్చవలసిన బాధ్యత, గోడలు లేని సువిశాల ఆహ్లాద ప్రపంచాన్ని నిర్మించి వినీలాకాశం కప్పు కింద ఒక సురుచిర శాంత సమాజాన్ని నిర్మించవలసిన బాధ్యత భవిష్యత్ తరం మీద ఉన్నది. ఆ భవిష్యత్ చరిత్ర నిర్మాతలలో భాగంగా, చరిత్ర నిర్మాతలకు స్ఫూర్తిని అందించగల సాహిత్యకారులుగా యువ సాహిత్యకారుల మీద బాధ్యత పెరుగుతున్నది.

‘విద్వేషకాలంలో రచయితలు’, ‘బహుళ అస్తిత్వాలు –నిరసన గళాలు’, ‘భాష, అస్తిత్వం – ప్రతిఘటన స్వరాలు’, ‘లయాత్మక ప్రతిఘటన’, ‘ధిక్కారస్వరాలు’ వంటి శీర్షికలతోనే తమ బాధ్యతల పట్ల తమకు నెనరు ఉందని చూపుకుంటున్న యువరచయితలకు అభినందనలు, శుభాకాంక్షలు. యువతరం ఉడుకు నెత్తురు వల్ల అనివార్యంగా వ్యక్తమవుతున్న మార్కెటింగ్, అతి ప్రశంస, సాధన లేమి, అధ్యయనం లేమి, అసహనం వంటి అపసవ్యతలు ఉంటే ఉండవచ్చు గాని వారు నేర్చుకోవలసిన, నేర్చుకోదగిన వయసులో ఉన్నారు గనుక, వారి వయసు వల్లనే స్వార్థం ఇంకా అంటలేదు గనుక, అనుభవం మీద ఈ అవరోధాలను దాటుతారని కూడా ఆశించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page