దుర్గామాత‌గా భ‌ద్ర‌కాళి అమ్మ‌వారు..

ఆల‌యంలో భ‌క్తుల కోలాహ‌లం..

వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్‌10 : వరంగల్ లో ప్రసిద్ద భద్రకాళి దేవస్థానంలో దేవిశరన్నవరాత్రులు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 4 గంటలకు నిత్యహ్నికం నిర్వర్తించిన అనంత‌రం అర్చకులు అమ్మవారిని దుర్గామాత‌గా అలంకరించి పూజ‌లు చేశారు. గురువారం రోజు భద్రకాళీ జన్మోత్సవం. కృష్ణాష్టమి మాదిరిగానే రాత్రి కూడా అమ్మవారికి విశేష అభిషేక అర్చనాదులు, జపహోమాలు చేశారు. దేవీ నవరాత్రా వ్రతం చేసే సకల జనులు శాస్త్ర వచనం మేరకు ఈ రోజు అందరూ అమ్మవారిని భద్రకాళిగానే పూజిస్తారు. భద్రకాళీ విశ్వమంతా వ్యాపించి వున్నా భూమండలం మీద కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా ప్రసిద్ది చెందిన తెలంగాణలోనే వరంగల్ మహానగరంలో దుర్గాష్టమి నాడు కోటి యోగినీ గణాల‌తో అవతరించడం వల్ల ఈ వరంగల్ మహానగరం ఒక పవిత్రతను సంతరించుకుంది.

కాగా ఉదయం అమ్మవారికి భద్రపీఠ సేవ, సాయంకాలం అశ్వవాహన సేవలు జరిపారు. భద్రపీఠంపై ఊరేగుతున్న అమ్మవారిని దర్శించిన భక్తులకు భద్రములు, శ్రేయస్సు, సంపద, ముక్తిని ప్రసాదిస్తుంది. అశ్వ వాహనం మీద ఊరేగుతున్న అమ్మవారి దర్శనం లక్ష్మి ప్రాప్తిని, పరాక్రమమును కలిగిస్తుందని ఆలయప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు.

ఈ రోజు అమ్మవారి విశేష అలంకరణకు భారతి విద్యా సంస్థల అధినేతలు ఇరుకుళ్ళ సంజయ్ కుమార్-జయశ్రీ దంపతులు, సుహాస్-శ్రీనిధి దంపతులు తదితరులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. పూజనంతరం ఉభయ దాతలకు ఆలయ ఈవో శేషుభారతి శేష వస్త్రాలు బహూకరించి ప్రసాదాలు ఆందజేశారు. సాయంకాలం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హరికథ, భక్తి సంగీతం, కర్నాటక సంగీతం, కూచిపూడి నృత్యాలు భక్తులను అలరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *