– విపక్షాల తీరును తప్పు పట్టిన హోం మంత్రి అమిత్ షా
– ఆయన అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు
– దీనిపై రాద్దాంతం చేయడం తగదని హితవు
న్యూదిల్లీ, ఆగస్ట్ 25: ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్ హోమ అరెస్ట్ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర హోంమత్రి అమిత్ షా ఖండించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పందించారు. అనారోగ్య కారణాలతో ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేయగా దీనిపై ప్రతిపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రాజీనామా తర్వాత నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. దీంతో జగదీప్ ధన్‌ఖడ్ ఎక్కడ? అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ధన్‌ఖడ్ గృహ నిర్బంధంలో ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధన్‌ఖడ్ రాజీనామాపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా స్పందించారు. ‘హౌస్ అరెస్ట్’ వార్తలను తీవ్రంగా ఖండించారు. ఆరోగ్య సమస్యల కారణంగా ధన్‌ఖడ్ రాజీనామా చేసినట్లు చెప్పారు. ’రాజీనామాకు గల కారణాలను ధన్‌ఖడ్ సాబ్ లేఖలో స్పష్టంగా చెప్పారు. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి.. పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అనుసరిస్తూ చక్కగా పనిచేశారు. ఆయన రాజీనామా గురించి ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని మరీ ఎక్కువగా లాగొద్దు. కేవలం ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా దీనిపై ఓ అంచనాకు రావడం సరికాద’ని అమిత్ షా స్పష్టం చేశారు. ధన్‌ఖడ్ రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను బీజేపీ ప్రభుత్వం బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఇక విపక్ష ఇండి కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి ఎంపిక చేశారు. వచ్చే నెల 9న ఎన్నిక జరగనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ విజయం లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సంఖ్యా బలం దృష్ట్యా చూస్తే ఆయన ఎన్నిక ఏకపక్షంగా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





