అద్వానీ రికార్డు బ్రేక్‌

– అత్యధిక కాలం హోంమంత్రిగా అమిత్‌ షా

నూల్లీ, ఆగస్టు 5 : ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా ఇందిరాగాంధీ పేరుతో ఉన్న రికార్డును ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ అధిగమించారు. ఆయనలాగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం దేశ చరిత్రలో అత్యధిక కాలం కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అరుదైన రికార్డుగా చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకూ బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ పేరుతో ఉన్న రికార్డును షా బద్దలు కొట్టారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక అమిత్‌ షా 2019లో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో షా వరుసగా రెండోసారి కూడా హోంశాఖ బాధ్యతలనే స్వీకరించారు. హోంశాఖ బాధ్యతలు స్వీకరించి నేటికి ఆరు సంవత్సరాల 64 రోజులు పూర్తయింది. దాదాపు 2,194 రోజులు హోం మంత్రిగా పనిచేశారు. ఫలితంగా బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ రికార్డును షా బద్దలుకొట్టారు. 1998-1999, 1999-2004 వరకూ అద్వానీ కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. దాదాపు 2,193 రోజులు అద్వానీ ఈ పదవిలో కొనసాగారు. అమిత్‌ షా తన హయాంలో ఆర్టికల్‌ 370 రద్దు సహా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా దేశంలో నక్సలిజంపై ఉక్కుపాదం మోపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *