ఉగ్రమూకలను అణచివేస్తే సంతోషించరా..

– మాజీ హోంమంత్రి చిందబరం వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్‌
– విపక్ష ఎంపీల వ్యాఖ్యలు దారుణం
– ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులను మట్టుబెట్టాం
– లోక్‌సభలో హోం మంత్రి అమిత్‌షా

న్యూదిల్లీ, జూలై 29: పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌పై విపక్షాలు సంతోషం వ్యక్తం చేస్తాయనుకుంటే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. లోక్‌సభలో రెండో రోజు మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు. విపక్ష ఎంపీల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. ఉగ్రవాదులను మట్టుబెడితే ఆనందం వ్యక్తం చేస్తారనుకున్నానని.. కానీ విపక్ష సభ్యులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఒకసారి ఆలోచించాలంటూ హితవుపలికారు. ఉగ్రవాదులు చనిపోయారన్న సంతోషం వారిలో కనిపించలేదని చెప్పారు. ఉగ్రవాదులు పాక్‌ నుంచే వచ్చారనేందుకు ఆధారాలున్నాయా అన్న చిదంబరం ప్రశ్నకు అమిత్‌ షా స్పందించారు. పాక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా.. పాక్‌కు క్లీన్‌చిట్‌ ఇవ్వాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం తగదని హితవు పలికారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌ నుంచి వచ్చారనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల నుంచి కొన్ని పాక్‌ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామని, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా అరెస్టు చేశామని చెప్పారు. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, జమ్ము పోలీసులకు అమిత్‌షా అభినందనలు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ సవిూపంలో ఉన్న హర్వాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో గత నెల రోజులుగా ఆ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయని, లష్కరే, జైషే ఉగ్రవాదుల కదలికల కోసం 14 రోజులుగా మరింత ముమ్మరంగా నిఘాను పెంచాయని, ఈ క్రమంలో దాచిగామ్‌ నేషనల్‌ పార్క్‌ పరిసరాల్లో రెండు రోజుల కిందట అనుమానాస్పద కమ్యూనికేషన్లను భారత సైన్యం ఈనెల 22న శాటిలైట్‌ ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా గుర్తించామని, సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఆపరేషన్‌ మహాదేవ్‌లో ఆ పార్కు వద్ద ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని తెలిపారు. వీరిలో ఉగ్రవాది సులేమాన్‌ షాతోపాటు పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్‌ ఉన్నట్టు అధికారులు తెలిపారన్నారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది అబూ హామ్‌జా కూడా హతమైనట్టు పేర్కొన్నారు. వీరందరూ విదేశీ ఉగ్రవాదులేనని తెలిపారు. పహల్గాం దాడి బాధితులను కలిసి వారి బాధలు తెలుసుకున్నామని, పహల్గాం దాడి ఘటనను వెంటనే ఎన్‌ఐఎకు అప్పగించామని అమిత్‌షా వివరించారు. పహల్గాం దాడి కేవలం పర్యాటకులపై కాదు.. దేశంపై దాడిగా పరిగణించాలరు. ఆనాడు 140 కోట్ల మంది ప్రజల గుండెచప్పుడును ప్రధాని మోదీ వివరించారని అమిత్‌ షా గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *