– అమెరికా మరో సంచలన నిర్ణయం
వాషింగ్టన్, జనవరి 23: అనేక విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వోనుంచి అధికారికంగా వైదొలగింది. అధ్యక్షుడిగా రెండోసారి అందలమెక్కినప్పటి నుంచి ట్రంప్ పలు సందర్భాల్లో ఆ సంస్థ నుంచి వైదొలగుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా అగ్రరాజ్యం తన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. కొవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణల అమలులో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం తెలిపింది. ఇకపై డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల నిధులు నిలిపివేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని అన్ని కార్యాలయాల నుంచి యూఎస్ సిబ్బందిని వెనక్కి పిలిపించినట్లు వెల్లడించింది. సంస్థకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా తప్ప్పుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఇకనుంచి పరిమిత పరిధి మేరకు డబ్ల్యూహెచ్‌వోతో కలిసి పనిచేయనున్నట్లు యూఎస్ ఆరోగ్యశాఖాధికారులు వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌వో నుంచి అగ్రరాజ్యం వైదొలిగే సమయానికి అమెరికా దానికి 260 మిలియన్ డాలర్ల (రూ.2,382 కోట్లు) బకాయిలను చెల్లించాల్సి ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదికలు వెల్లడించాయి. ఈ విషయంపై డబ్ల్యూహెచ్‌వో అధికారులు మాట్లాడుతూ సంస్థ నుంచి తప్ప్పుకుంటున్నట్లు అమెరికా వెల్లడించగానే సరిపోదని, సంస్థకు బకాయిపడిన 260 మిలియన్ డాలర్లను చెల్లించే వరకు డబ్ల్యూహెచ్‌వో నుంచి యూఎస్ ఉపసంహరణ పూర్తి కాదని అన్నారు. ఈ బకాయిలపై అమెరికా అధికారిక వర్గాలు స్పందిస్తూ సంస్థ నుంచి వైదొలగడానికి ముందు బకాయిలను పూర్తిగా చెల్లించాలనే చట్టబద్ధమైన నియమమేవిÖ లేదన్నారు. దీంతో ఇక్కడ ఘర్షణ తప్పేట్లు లేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




