అమెరికా కాన్సుల్‌ జనరల్‌ లార్సన్‌కు ఆత్మీయ వీడ్కోలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: అమెరికా కాన్సుల్‌ జనరల్‌గా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జెన్నిఫర్‌ లార్సన్‌కు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేనేత చీరను ఆమెకు బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ-అమెరికా మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆమె విశేష కృషి చేశారని కొనియాడారు. విద్య, సాంస్కృతిక మార్పిడి, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఆమె అందించిన సహకారం, దార్శనికతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ తెలంగాణ-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా సహకారం అందించాలని కోరారు. ఆమె తదుపరి ప్రయాణంలోనూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాక్షించారు.

తెలంగాణ స్టేట్‌ కాన్సులర్‌ వెయిటింగ్‌ ఏరియా ప్రారంభం

తమ ప్రభుత్వం వేసే ప్రతి అడుగు ప్రజల కోసమేనని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయ ప్రాంగణంలో రూ.1.5 కోట్లతో తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(టీజీఐఐసీ) నిర్మించిన తెలంగాణ స్టేట్‌ కాన్సులర్‌ వెయిటింగ్‌ ఏరియాను ఆయన గురువారం లాంఛనంగా ప్రారంభించారు. యూఎస్‌ కాన్సులేట్‌కు రోజూ మూడువేల మందికిపైగా సందర్శకులు వస్తుంటారని, వేచి చూసేందుకు సరైన సౌకర్యాలు లేక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికొచ్చిందన్నారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి అందుకనుగుణంగా అత్యాధునిక వసతులతో కూడిన వెయిటింగ్‌ ఏరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. కేవలం పారిశ్రామిక, సాంకేతిక రంగాలకే పరిమితం కాకుండా ప్రజల రోజువారీ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు ఇది నిదర్శనమని మంత్రి వివరించారు. ఫార్మా, ఏరోస్పేస్‌, ఎలక్ట్రానిక్స్‌, ఈవీ రంగాల్లో అమెరికా మన రాష్ట్రానికి అగ్రగామి వ్యాపార భాగస్వామి అని తెలిపారు. మన ఐటీ ఎగుమతుల్లో 38 శాతం ఉత్తర అమెరికాకు జరుగుతున్నాయని, ఈ ఏడాది ఒక్క జనవరిలోనే అమెరికా కంపెనీలు రాష్ట్రంలో రూ.31,500 కోట్ల పెట్టుబడులను పెట్టాయని, ఫలితంగా 30వేల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి అని చెప్పారు. కార్యక్రమంలో అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నీఫర్‌ లార్సన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *