పంచాయతీ సవరణ బిల్లుల‌కు ఏక‌గ్రీవ ఆమోదం

– ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న ఎత్తివేత
– జైన్ తిర్మ‌లాపూర్ గ్రామం పేరు మార్పు
– బిల్లుల‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3ః ఇద్దరికి మించి సంతానం ఉంటే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధన తొలగిస్తూ చేసిన పంచాయ‌తీరాజ్ చ‌ట్టం సవరణ, వ‌న‌ప‌ర్తి జిల్లా జైన్ తిర్మ‌లాపూర్ గ్రామం పేరు మార్ప‌ బిల్లుకు శాస‌న‌స‌భ ఏక‌గ్రీవ ఆమోదం తెలిపింది. గ‌తంలో చట్టంలోని 21వ సెక్షన్ స‌వ‌ర‌ణపై ఆర్డినెన్సులు జారీ కాగా వాటికి సంబంధించిన బిల్లుల‌ను పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క అసెంబ్లీలో శ‌నివారం ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ద‌క్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ‌ను పాటిస్తుండ‌గా ఉత్తరాది రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులు లేక‌పోవ‌డంతో దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది రాజకీయ ఆధిపత్యం పెరుగుతోంద‌ని తెలిపారు. మన రాష్ట్రంలో జనాభా నియంత్రణ పూర్తిస్థాయిలో పాటించడం వల్ల జనాభా తగ్గిపోయే అవకాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. భవిష్యత్తు దృష్ట్యా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇద్దరు పిల్లలకు మించి ఉండకూడదనే నిబంధనను తొలగిస్తున్నామ‌ని చెప్పారు. త‌మ నిర్ణయాన్ని సభలో సభ్యులంతా స్వాగతించారంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తుల్లో అవసరం ఉంటే మరో విధంగా నిబంధనలను పెట్టుకుందామ‌న్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కూడా త‌మ‌ నిర్ణయాన్ని స్వాగతించారన్నారు. అలాగే వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలంలోని జైన్ తిరుమలాపూర్ గ్రామం పేరును జయన్న తిరుమలాపూర్ గా మార్చే బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులకు సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *