– పట్టపగలే నడిరోడ్డుపై కాల్చి చంపిన దుర్మార్గులు.
– దుండగులను పట్టుకోలేని పాలకులు-
– నేటికీ జిల్లా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు
వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: పేదలకు వైద్యం అందించాలనే సంకల్పంతో వైద్య వృత్తిని ఎంచుకుని సేవలందించే ప్రజా వైద్యుడిని 29 ఏళ్ల క్రితం పట్టపగలే నడిరోడ్డుపై దుర్మార్గులు కాల్చి చంపారు. చిరునవ్వుతో పలకరిస్తూ రోగులకు సేవలందించే వైద్యుడిని అమానుషంగా కాల్చి చంపిన రోజును వరంగల్ జిల్లా ప్రజలు నేటికీ మరువలేకపోతున్నారు. జిల్లా కేంద్రం శివారులోని మొగిలిచర్ల గ్రామానికి చెందిన ఆమెడ నారాయణ ప్రజా వైద్యుడిగా అనతి కాలంలోనే ఖ్యాతిని గడిరచారు. ఉదయమే తన ద్విచక్ర వాహనంపై చుట్టుపక్కల పది గ్రామాల ప్రజలకు వైద్య సేవలందిస్తూ, పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేసిన ఆయన జిల్లా ప్రజలకు సుపరిచితులు. 1990 ప్రాంతంలో పీపుల్స్‌వార్ పార్టీ ప్రభావం అధికంగా ఉన్న రోజుల్లో పౌరహక్కుల నేత స్వర్గీయ డాక్టర్ రామనాథం చేతుల మీదుగా ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేశారు. నారాయణ కేవలం రూ.5లకే పేదలకు వైద్యం అందిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. వైద్యుడు అంటే దేవుడితో సమానం అనే భావన ఆ రోజుల్లో ప్రజల్లో ఉండేది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు రోగులకు వైద్యం అందించడమేకాక వారి కుటుంబ స్థితిగతులను కూడా తెలుసుకునే వ్యక్తిత్వం కలిగిన నారాయణ అతి త్వరలోనే ప్రజా వైద్యుడిగా పేదల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. అప్పుడున్న పరిస్థితుల కారణంగా ఆయనకున్న పేరును కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోయాయి. ఎలాగైనా ఆయనను అంతమొందించాలనే లక్ష్యంతో కుట్ర పన్నాయి. అందులో భాగంగానే సెప్టెంబర్ 25, 1996న ఉదయం 7.30 సమయంలో డాక్టర్ ఆమెడ నారాయణను గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేశారు. ప్రజా వైద్యుడి హత్య వార్త జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. సంఘటన స్థలానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. సుమారు 30 గ్రామాల నుంచి ముఖ్యంగా మొగిలిచర్ల గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి డాక్టర్ నారాయణకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ ఘటనతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అవ్పటి పాలకుల కుట్రలో భాగంగానే నారాయణ హత్య జరిగినట్లు ప్రచారం జరిగింది. పోలీనుల చేతనే పాలకులు ఆమెడ నారాయణను చంపించారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యత వహించాలని ప్రజాసంఘాలు దుమ్మెత్తి పోశాయి. ఆ ఘటన జరిగి 29 ఏళ్లు కావస్తున్నప్పటికీ పాలకులు దుండగులను పట్టుకోకపోవడం శోచనీయం. ఇప్పటివరకు హంతకులను గుర్తించకపోవడం ప్రజల్లో ప్రశ్నగానే మిగిలింది. నేటికీ డాక్టర్ ఆమెడ నారాయణను ప్రజల స్మరించుకుంటున్నారంటే ప్రజల మనుషులు ఎప్పుడూ చిరస్మరణీయులే అనేది వాస్తవం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



