– తప్పుడు ప్రచారం చేయొద్దు
– 8 అంబులెన్స్ లు పనిచేశాయి
-15 మంది పేషెంట్లను హాస్పిటల్స్ కు తరలించాం
-పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవిందర్ నాయక్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద బాధితులను దవాఖానకు తరలించిన అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సిలిండర్లు లేవంటూ జరుగుతున్న ప్రచారాన్ని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవిందర్ నాయక్ ఖండించారు. ఘటనా స్థలం నుంచి ఉదయం 6 గంటల 25 నిమిషాలకు అంబులెన్స్‌లో ( నంబర్ టిఎస్08యుఎల్5682) తొలి రోగిని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించామని ఆయన తెలిపారు. మొత్తం 8 అంబులెన్స్‌లు ఘటన స్థలానికి పంపించామన్నారు. ఘటనా స్థలం నుంచి 15 మంది పేషెంట్లను 108 అంబులెన్స్‌లలో ఉస్మానియా, కేర్, అపోలో, యశోద హాస్పిటల్స్‌కు తరలించామని చెప్పారు. ప్రతి అంబులెన్స్‌లోనూ ఆక్సిజన్ సౌకర్యం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఆపద సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరమైన అపోహలు సృష్టించి, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది మనోధైర్యాన్ని దెబతీయొద్దని రవిందర్ నాయక్ విజ్ఞప్తి చేశారు.
అగ్నిప్రమాద ఘటన గురించి తెలిసిన మరుక్షణమే అప్రమత్తమయ్యామని, ఘటనా స్థలానికి డాక్టర్ల బృందాన్ని పంపించామని డీహెచ్ వెల్లడించారు.క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు, స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి ఉస్మానియా హాస్పిటల్‌లో సిద్ధంగా ఉంచామని తెలిపారు. దురదృష్టవశాత్తు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. బాధిత కుటుంబ సభ్యుల పరిస్థితిని అర్థం చేసుకుని, వారికి మరింత అసౌకర్యం కలగకుండా వీలైనంత త్వరగా పోస్ట్‌మార్టమ్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ సహా ఉన్నతాధికారులంతా ఉదయమే ఉస్మానియా హాస్పిటల్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించామని రవిందర్ నాయక్ తెలిపారు. అన్ని అంబులెన్స్‌లలో ఆక్సిజన్ ఉందని, తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



